Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాష్ట్ర శాసనసభ , లోక్ సభ ఎన్నికల ఫలితాలు రావడానికి ముందుగా వచ్చిన మున్సిపల్ , జిల్లా,మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. తెలుగుదేశం పార్టీ కి అద్బుతమైన విజయాలను తెచ్చి పెట్టి, ఆ పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చాయంటే ఆశ్చర్యం కాదు.బహుశా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇంత ప్రభంజనం వస్తుందని ఊహించి ఉండరు.దీనితో వారు ఇక అదికారానికి ఒక రోజు ( మరో రోజులో ఫలితాలు రానున్నాయి) దూరంలో ఉన్నామన్న విశ్వాసానికి రావడంలో తప్పు కూడా లేదు.ఇంతకాలంగా సీమాంద్రలో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతినిపోయిందన్న పరిస్థితి నుంచి ఒక్కసారిగా పులిలా విజృంభించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది.ఇంతవరకు తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవకపోతామా అన్న ఆశతో ఉండేది.కాని ఈ ఫలితాలు చూశాక వారికి అది విశ్వాసాన్ని ఇచ్చింది.ధీమాను కల్పించింది.ఆశ నమ్మకంగా మారిపోయింది. అదే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విషయంలో ధీమా కాస్త ఆశగా మారిపోయింది. ఈ ఫలితాలు ఇలా ఉన్నా, శాసనసభ ఎన్నికలలో నెగ్గుకు రాలేకపోతామా? అన్న ఆశ మాత్రమే వారికి మిగిలింది. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికలలో అయితే ఏకపక్షంగా విజయాలను సాధిస్తే,గ్రామీణ ఎన్నికలలో తన ఆధిక్యతను స్పష్టంగా కనబరించింది. గత నాలుగు ఏళ్లలో ఒక్క ఉప ఎన్నిక తప్ప,మిగిలిన నలభై ఉప ఎన్నికలలో ఘోరఫలితాలను చవిచూసిన టిడిపి శ్రేణులకు ఈ ఫలితాలు వీనుల విందు అవుతుందనడంలో సందేహం లేదు.దీనికి కారణాలు ఏమై ఉంటాయన్నదానిపై తర్జనభర్జన జరుగుతోంది.ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన పరిణామాలలో టిడిపికి ఇది బాగా కలిసి వచ్చింది.తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడుకు ఉన్న ఇమేజీ దానికి తోడ్పడిందని అనుకోవాలి. చంద్రబాబు అయితే సమర్దుడు, అభివృద్ది వైపు తీసుకుని వెళతారని నమ్మి ఉండాలి. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ కి దిగువ స్థాయిలో క్యాడరు ఉండడం, యంత్రాంగం ఉండడం, వనరులు కలిగి ఉండడం వంటివి ప్లస్ పాయింట్లుగా కనిపిస్తాయి. మున్సిపల్ ప్రాంతాలలో టిడిపికి ఆధిక్యత వస్తుందనుకున్నారు కాని, ఇంతగా స్వీప్ గా వస్తుందని అనుకోలేదు.అది కచ్చితంగా గమనించదగిన అంశమే అవుతుంది.అయితే అదే స్థాయిలో కాకపోయినా, గ్రామీణ ఓట్లలో కూడా మెజార్టీ పొందడంతో తిరుగులేని పరిస్థితి వచ్చింది. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినడం, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు నియోజకవర్గాలలో అంత బలమైన నాయకత్వం లేకపోవడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. అప్పటికే టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం కూడా ఉపయోగపడి ఉండవచ్చు. ఇది మండల ఎన్నికలలోనే పనిచేస్తే, శాసనసభ ఎన్నికలలో పని చేయకుండా ఉంటుందా?అన్న సందేహం వస్తుంది.అందువల్ల మున్సిపల్ ఎన్నికలు , మండల,జడ్పిటిసి ఎన్నికల ఫలితాల ఆధారంగా తెలుగుదేశం పార్టీ సీమాంద్రలో అదికారంలోకి రావడం తధ్యం అన్న భావన కలుగుతుంది.దానికి తగ్గట్లుగానే విజయవాడ మాజీ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ టిడిపి బిజెపి కూటమికి 115 నుంచి 125 స్థానాలు వస్తాయన్నది తమ సర్వేలో వెల్లడైందని పేర్కొన్నారు.శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న ఫలితాల సరళి కూడా లగడపాటి సర్వే నిజం అవుతుందన్న భావన కలిగిస్తుంది.అయితే ఇది బిజెపితో పొత్తు పెట్టుకోకముందు వచ్చిన ఫలితాలు, అలాగే సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకముందు వచ్చిన ఫలితాలు.ఇప్పుడు ఇంత బాగా వస్తే , వారు కూడా కలిసిన తర్వాత ఇంకెంత బాగుంటాయన్న చర్చ కూడా వస్తుంది.ఈ నేపధ్యం తెలుగుదేశం లో గెలుపు ధీమాకు కారణంగా కనిపిస్తుంది.
ఇక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పరిస్థితి చూస్తే,వారు గెలుపు పై ఎంతో భరోసాతో ఉన్న సమయంలో ఈ మున్పిసల్ , మండల,జడ్పి ఎన్నికలు వారికి శరాఘాతంగానే తగిలాయి. సుప్రింకోర్టు ఈ ఫలితాల వెల్లడిపై స్టే ఇచ్చింది కాబట్టి సరిపోయింది కాని,లేకుంటే అవి వెల్లడై ఉంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అప్పుడే ఆశలు వదలుకోవలసి వచ్చేది.అయితే ఈ పార్టీ వాదన మరో లా ఉంది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలు భిన్నమైనవని, అందువల్ల వాటిని పరిగణనలోకి తీసుకోనవసరం లేదని వాదిస్తోంది. టిడిపికి యంత్రాంగం ఉండడం, కాంగ్రెస్ వారు కూడా టిడిపికి సహకరించడం, ఆర్దిక వనరులు వంటి కారణాలతో టిడిపి గెలిచిందని ఆ పార్టీ విశ్లేషిస్తోంది.తాము ఎమ్మెల్యే, ఎమ్.పి అభ్యర్దులపైనే దృష్టి పెట్టామని ,అందువల్ల వీటిపై పెద్దగా ఖర్చు చేయలేదని కూడా చెబుతోంది.ఆయా ఎక్జిట్ పో్ల్స్ , జాతీయ మీడియాలో వచ్చే ఎక్జిట్ పోల్స్ లో నువ్వా,నేనా అన్నట్లు ఉన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.తమ నాయకుడు జగన్ గెలుపు విషయంలో ఎలాంటి సందేహంతో లేరని కూడా వారు వివరిస్తున్నారు.మున్సిపల్ ఎన్నికలలో కన్నా, గ్రామీణ ప్రాంతాల ఎన్నికలలో తాము గణనీయమైన ఫలితాలు సాధించామని, మూడేళ్ల క్రితం పుట్టి,ఎలాంటి యంత్రాంగం లేకపోయినా, ఇంత ఫలితం సాధించడమే గొప్ప అని వారు వాదిస్తున్నారు.అయితే రాయలసీమ తమకు కంచుకోట వంటిదని వారు భావించారు. కాని చిత్తూరు,అనంతపురం జిల్లాలలో దెబ్బతినడం మాత్రం జీర్ణించుకోలేనిదేనని చెప్పాలి.శాసనసభ ఎన్నికలలో కూడా ఈ రెండు జిల్లాలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఫలితాలు ఇలాగే ఉంటే అదికారం రావడం దాదాపు అసాధ్యమే అవుతుంది. అలాకాకుండా వీరు ఆశించినట్లు మున్సిపల్,జడ్పి ఎన్నికల తర్వాత బిజెపితో టిడిపి పొత్తు వల్ల ముస్లిం మైనార్టీలు తమవైపు పూర్తిగా వచ్చారని,అది తమకు అదనపు బలం అవుతుందని వారు చెబుతున్నారు.అంతేకాక మున్సిపల్ ఎన్నికల సమయంలో తమ నేతలు పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదని వారు అంటున్నారు.ఏది ఏమైనా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఈ ఫలితాలు ఆత్మరక్షణలో పడేశాయని చెప్పక తప్పదు.అందువల్ల తెలుగుదేశం ది గెలుపు ధీమా అయితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలుపు ఆశ మాత్రమేనని చెప్పక తప్పదు.తాజాగా ఎన్డిటివి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,టిడిపిల మద్య హోరాహోరీ ఉందని చెబుతూనే జగన్ కు స్వల్ప మొగ్గు ఇవ్వడం ఈ పార్టీకి ఆశకు మరింత జీవం పోసినట్లవడం కొసమెరుపు.