Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సాధారణంగా వెస్టిండీస్ క్రికెటర్లు చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ జోక్ లు వేస్తూ ఉంటారు. తమ దీవుల్లో ప్రఖ్యాత క్యాలిప్సో సంగీతాన్ని భారత్‌లోనూ అభిమానులకు ఆటతో రుచి చూపిస్తున్నారు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఇప్పటిదాకా ప్రతిసారీ కరీబియన్లు ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఈ సీజన్‌లోనూ వెస్టిండీస్ స్టార్స్ అటు ఆటతో ఇటు తమ చేష్టలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు.

ఓ మ్యాచ్‌లో కాస్త ఆవేశంగా వ్యవహరిస్తే అంపైర్ హెచ్చరించడం సహజం. మిగిలిన ఆటగాళ్లైతే కామ్‌గా వెళ్లిపోతారు. లేదా బ్యాట్‌తోనో, బంతితోనో తమ కసిని చూపిస్తారు. కానీ పొలార్డ్ మాత్రం నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. వెస్టిండీస్ క్రికెటర్లు ఎంత భిన్నంగా అభిమానులను అలరిస్తారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. క్రిస్ గేల్ సిక్సర్ల సునామీ, డ్వేన్ బ్రేవో ఆల్‌రౌండ్ నైపుణ్యం, లెండిల్ సిమ్మన్స్ కళ్లుచెదిరే క్యాచ్‌లు… ఇలా ఈసారి ఐపీఎల్‌లోనూ కరీబియన్ స్టార్స్ తమ ముద్ర వేశారు. ఈసారి లీగ్‌లో అందరికంటే ఎక్కువగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారు. వార్నర్, స్టీవ్ స్మిత్‌లాంటి ఒకరిద్దరు తప్ప మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కానీ బరిలోకి దిగిన అర డజను వెస్టిండీస్ క్రికెటర్లు మాత్రం తమ ఆటతీరుతో తమ తమ జట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు.        

క్రిస్ గేల్ (బెంగళూరు రాయల్ చాలెంజర్స్)

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. ఎనిమిది సీజన్లలో ఐదు సెంచరీలు కొట్టాడు. ఈసారి తొలి మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగుల తేడాతో శతకాన్ని కోల్పోయిన ఈ డాషింగ్ ఓపెనర్… పంజాబ్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. మిషెల్ జాన్సన్‌కైతే చుక్కలు చూపించాడు. గత సీజన్లతో పోలిస్తే కాస్త జోరు తగ్గినా… బెంగళూరుకు అతనే ఇప్పటికీ కీలక బ్యాట్స్‌మన్.
 మ్యాచ్‌లు: 9; పరుగులు: 370; సెంచరీ 1; అర్ధసెంచరీలు : 2

 కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్)

ముంబై మ్యాచ్‌లో లాంగాన్ లేదా లాంగాఫ్ ప్రాంతంలోకి బంతిని గాల్లోకి లేపాలంటే ఏ బ్యాట్స్‌మన్ అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ పొలార్డ్ ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఏ విన్యాసం చేసి బంతిని ఎలా అందుకుంటాడో అతనికే తెలియదు. తన ఫీల్డింగ్‌తోనే పొలార్డ్ అభిమానులను అలరిస్తాడు. ఇక బ్యాటింగ్‌లో అతను కాస్త ఆలస్యంగా క్రీజులోకి వస్తున్నాడు. అయితే ఈ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఒత్తిడిలో ఆడినా రాణించాడు. ముంబై జట్టు కోలుకోవడంలో పొలార్డ్‌ది కీలక పాత్ర.
 మ్యాచ్‌లు: 12; పరుగులు: 309; అర్ధసెంచరీలు: 2; క్యాచ్‌లు: 8

 డ్వేన్ స్మిత్ (చెన్నై సూపర్ కింగ్స్)
ఈ సీజన్‌లో చెన్నై విజయ రహస్యం ఓపెనర్లు రాణించడం. మెకల్లమ్‌తో పాటు డ్వేన్ స్మిత్ ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ఈ సీజన్ ఆరంభంలో బాగా ఆడినా క్రమంగా కాస్త ఫామ్ కోల్పోయాడు. అయితే తన ఆటతీరులో దూకుడు తగ్గించి మెకల్లమ్‌కు కావలసిన సహకారం అందిస్తున్నాడు.
 మ్యాచ్‌లు: 13; పరుగులు: 325; అర్ధసెంచరీ: 1; క్యాచ్‌లు: 9

 లెండిల్ సిమ్మన్స్ (ముంబై ఇండియన్స్)
ముంబై ఈసారి ఆరోన్ ఫించ్‌ను తీసుకోవడం వల్ల టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో సిమ్మన్స్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఫించ్ గాయంతో వైదొలగడంతో అతనికి వెంటనే అవకాశం లభించింది. ఈసారి కూడా సిమ్మన్స్ తన విలువను నిరూపించుకున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ముంబైకి మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు.
 మ్యాచ్‌లు: 9; పరుగులు: 345; అర్ధసెంచరీలు: 4; క్యాచ్‌లు: 3

 ఆండ్రీ రస్సెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్)
ఈసారి కోల్‌కతా విజయాల్లో అత్యంత కీలక ఆటగాడు రస్సెల్. గత ఏడాది తుది జట్టులో అతనికి స్థానమే లేదు. అయితే ప్రపంచకప్‌లో ఫామ్‌ను చూసి ఈసారి మొదట్నించీ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడించారు. తన సంచలన హిట్టింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని కోల్‌కతా వైపు తిప్పేస్తున్నాడు. ఇక బౌలింగ్‌లోనూ ఈసారి బాగా మెరుగుపడ్డాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చక్కటి బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను నియంత్రిస్తూ కోల్‌కతాకు అత్యంత విలువైన క్రికెటర్‌గా ఎదిగాడు.
 మ్యాచ్‌లు: 11; పరుగులు: 287; అర్ధసెంచరీలు: 3; వికెట్లు: 11

 డ్వేన్ బ్రేవో (చెన్నై సూపర్ కింగ్స్)

మొత్తం వెస్టిండీస్ క్రికెటర్లందరిలో ఎక్కువ వినోదాన్ని ఇచ్చే క్రికెటర్ డ్వేన్ బ్రేవో. తన సంచలనాత్మక క్యాచ్‌లతో పాటు డెత్ ఓవర్లలో వైవిధ్యంతో కూడిన కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ల దిశను మారుస్తున్నాడు. అందుకే చెన్నై కెప్టెన్ ధోని అతణ్ని నమ్మినంతగా ఎవరినీ నమ్మడు. 13 ఓవర్లు పూర్తయ్యాక చివరి ఏడు ఓవర్లలో నాలుగు బ్రేవోతో వేయిస్తున్నాడంటే ధోనికి ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాటింగ్‌లోనూ బ్రేవో ఓ అద్భుతం. ఎంత ఒత్తిడిలో అయినా భారీ షాట్లు ఆడటం అతని ప్రత్యేకత .
 మ్యాచ్‌లు: 13; పరుగులు: 166; వికెట్లు: 19; క్యాచ్‌లు: 12