Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జయలలిత మరణానంతరం ఆమెకు తానే వారసురాలిని అని ప్రకటించుకున్న జయలలిత మేనకోడలు దీప త్వరలోనే రాజకీయాలలోకి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి అవడం ఇష్టం లేని చాలామంది ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు దీప ఇంటిముందు పడిగాపులు పడి మరీ ఆమెను రాజకీయాలలోకి రావాలని కోరుతున్నారు. జయలలిత ఆసుపత్రిలో చేరే వరకు దీప ఎవరో ఎవరికీ తెలీదు. అయితే జయలలితను చూడడానికి వెళ్ళినపుడు ఆమెను అడ్డుకోవడంతో ఆమె అప్పట్లో మీడియాతో మాట్లాడింది. అప్పుడే ఆమె కొంతమందికి తెలిసింది. అయితే జయలలిత మరణం తరువాత ఆమె పేరు రాష్ట్రమంతా మార్మోగిపోయింది. తానే జయలలితకు అసలుసిసలైన వారసురాలిని అని ఆమె ప్రకటించుకుంది. అప్పటినుండి తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆమె గురించి చర్చ మొదలైంది.

జయలలిత మరణించిన తరువాత ఆమె భౌతిక కాయాన్ని సందర్శించుకోవడానికి వచ్చిన దీపను అడ్డుకోవడం, ఆమె అందరినీ ప్రతిఘటించి జయలలితకు శ్రద్ధాంజలి ఘటించడం వంటి అంశాలతో ఆమెపై ప్రజలకు సానుభూతి పెరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దీపను ప్రకటించాలని చాలామంది అన్నాడీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే ఆ పదవిని జయలలిత స్నేహితురాలు శశికళ వరించింది. దీంతో శశికళ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడం ఇష్టంలేని నాయకులు, కార్యకర్తలు దీపను రాజకీయాలలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీప కూడా రాజకీయాలలోకి రావడానికి సిద్దంగానే ఉన్నారు. రోజూ దీప ఇంటిముందు వేలాది కార్యకర్తలు క్యూ కడుతున్నారు. ఇంటికి వచ్చిన వాళ్లందరినీ ఆమె చాలా ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. వచ్చిన వాళ్లందరితో ఎంతో ఓపిగ్గా మాట్లాడుతున్నారు.

ఆమె ఇంట్లో లేని సమయంలో కూడా కార్యకర్తలు వచ్చి దీప భర్త మాధవన్ ను కలిసి ఆమెను రాజకీయాలలోకి రావాల్సిందిగా కోరుతున్నారు. మాధవన్ కూడా ఆమె రాజకీయాలలోకి వస్తే తనకేం ఇబ్బంది లేదని, అది ఆమె ఇష్టం అని స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం దీప మాట్లాడుతూ తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. జయలలిత పేరు, ప్రతిష్టలను కాపాడాల్సిన భాద్యత మనందరిపై ఉందని ఆమె కార్యకర్తలతో చెప్పారు. త్వరలోనే తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తానని ఆమె చెప్పారు. అప్పటివరకు కొంచెం ఓపిక పట్టాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. దీంతో కార్యకర్తలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. దీపను చూస్తుంటే జయలలితను చూస్తున్నట్టే ఉందని, తమకు ఆమె మాత్రమే నాయకురాలిగా ఉండాలని వారు అంటున్నారు.