Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అందరూ నటీనటులే ఉన్న కుటుంబంలో పుట్టింది అక్షర హాసన్‌. అగ్ర హీరో    కమల్‌హాసన్‌, నటి సారికల గారాలపట్టి ఈ చిన్నది. ఇప్పటికే అక్క శృతి హాసన్‌         దక్షిణాది సినిమాల్లో బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు అక్షర కూడా ‘షమితాబ్‌’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టపడే ఆమె.. అల్లరిలో ముందుంటుందట! ఎంతోకొంత అమ్మానాన్నల ప్రభావమున్నప్పటికీ.. ఇండివిడ్యువల్‌గానే ఎదుగుతానంటున్న ఈ కొత్త హీరోయిన్‌          మనసువిప్పి మాట్లాడింది.. .
‘షమితాబ్‌’లో అవకాశం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. దర్శకులు ఒక వేడుకలో నన్ను కలిశారు. ‘‘మీతో అయిదు నిమిషాలు మాట్లాడాలి..’’ అన్నారు. నేను ఆసక్తిగా వెళితే అక్కడే ఆయన ఈ సినిమా కథ చెప్పారు. కథ అద్భుతం అనిపించింది. ‘‘ఈ చిత్రానికి నన్నే ఎందుకు తీసుకుంటున్నారు?’’ అడిగాను. ‘‘కథను బట్టి మీరు అయితేనే సరిగ్గా సరిపోతారు’’ అన్నారాయన. నేను షాకింగ్‌! అలా ఇందులో నటించేందుకు అపురూపమైన అవకాశం వచ్చింది. షూటింగ్‌లో కూడా చాలా క్యాజువల్‌గా చేశాను. చిన్న చిన్న భయాలు ఉన్నప్పటికీ బయటికి కనిపించేదాన్ని కాదు. మమ్మీ మాత్రం చాలా భయపడేది. జాగ్రత్తలు చెప్పేది. మొత్తానికి షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. ఇక అక్క శృతి సంగతికొస్తే – ‘‘బాగా కష్టపడు. సొంత వ్యక్తిత్వంతో ఉండు’’ అని చెప్పేది. మా ఫ్యామిలీ మొత్తం సినిమా వాళ్లే కాబట్టి.. అందరం ఈ వృత్తిని బాగా ఇష్టపడతాము. ‘షమితాబ్‌’ త్వరలోనే మీ ముందుకు రానుంది. నటి కావడానికి ముందు – అంటే బాల్యం నుంచే నాకు డ్యాన్సులంటే ప్రాణం.
డ్యాన్స్‌ బేబీ
చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళితే – ఎనిమిదేళ్ల వయసు నుంచే సల్సా, హిప్‌-హోప్‌, పాప్‌ వంటి డ్యాన్సులన్నీ నేర్చుకున్నాను. స్కూల్‌ నుంచి డ్రాప్‌ అయ్యాక- చెన్నైలో ఉన్న నాన్న వద్దకు వెళ్లినప్పుడు అక్కడ.. భరతనాట్యం, కూచిపూడిలలోను శిక్షణ తీసుకున్నాను. మా అమ్మ రాహుల్‌ ధొలాకియాతో కలిసి ఒక యాడ్‌ ఫిల్మ్‌ చేసింది అప్పట్లో. నేను కూడా రోజూ షూటింగ్‌కు వెళ్లేదాన్ని. అక్కడే వ్యాన్‌లో కూర్చుని బుద్ధిగా హోంవర్కు అవీ చేసుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు. ఇంతకుముందే చెప్పాను, నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టమని. అందుకని షూటింగ్‌లో డ్యాన్సులు, యాక్టింగ్‌ వంటివన్నీ చూశాక – నేను ఎలాగైనా సరే మంచి డ్యాన్స్‌ కోర్సు చేయాలన్న ఉబలాట మొదలైంది. అందుకని సింగపూర్‌లోని లాసల్లె కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌కు దరఖాస్తు చేయాలనుకున్నాను. అందుకు మా డ్యాన్స్‌ టీచర్‌ సహాయాన్ని తీసుకున్నాను. ఆడిషన్స్‌ కోసం చాలా శ్రమించాను. సరిగ్గా అదే సమయంలో డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు నా కాలికి తీవ్రమైన గాయం అయ్యింది. చీలమండ దగ్గర దెబ్బ తగిలింది. మానసికంగా బాగా కుంగిపోయాను. ఏడాదిపాటు డ్యాన్స్‌ చేయలేకపోయాను. కొన్నాళ్లు చెన్నైలోనే విశ్రాంతి తీసుకుని.. మళ్లీ ముంబయికి వెళ్లా. ఇలా అటూఇటూ తిరుగుళ్లకే సమయం సరిపోయింది. ఆ తరువాత కొన్ని వాణిజ్య ప్రకటనల్లో చేశాను. దాంతో డ్యాన్స్‌ మీదే కాదు, నటన మీద కూడా నాకు ఇష్టం ఏర్పడింది. బాల్యం ఇలా గడిచింది.
సారిక మమ్మీ
నాకు నా తర్వాత అమ్మ అంటే ప్రాణం. తనే నాకు సర్వస్వం. చాలా విషయాల్లో అమ్మదీ నాది ఒకే మనస్తత్వం అనిపిస్తుంది. తను బాగా ఈజీ గోయింగ్‌. దేన్నయినా తట్టుకునే ధృడమైన మనస్తత్వం. అందర్నీ ప్రేమించే సున్నిత హృదయం. చాలా ప్రేమపూర్వకంగా మెలుగుతుంది. నేను ఎంత అల్లరి చేసినా ఇష్టపడుతుంది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే తెగువను అభినందిస్తుంది. వీటిలో ఎక్కువ లక్షణాలన్నీ అమ్మ నుంచి నాకు అబ్బినవే! అన్నీ సరే కాని నాలోని బద్దకం మాత్రం ఆమెకు నచ్చదు. ఇక్కడ అమ్మ గురించి చెబుతున్నాను కాబట్టి మా డ్యాన్స్‌ టీచర్‌ గురించి కూడా కొంత చెప్పుకోవాలి. నిజంగా నాకు ఆమె రెండో అమ్మతో సమానం. తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నా బలాలు, బలహీనతలు బాగా తెలుసు. ఏ చిన్న కష్టం వచ్చినా అండగా నిలుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
కమల్‌ డాడీ
నాన్న గురించి చెప్పుకోవాలంటే ఆయనకు నేనో పెద్ద అభిమానిని. ఆయన ఇప్పటికీ ఇరవైఏళ్లప్పుడు ఎలా పని చేస్తారో ఇప్పుడు కూడా అలాగే చేస్తుంటారు. అలుపు అనేదే ఉండదు. ఆయనకు అద్భుతమైన ఫిట్‌నెస్‌ ఉంది. ప్రతి విషయాన్ని చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఎలాంటి హంగామాకు పోరు. చాలా సింపుల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. తనో పెద్ద స్టార్‌నన్న భావనేదీ దగ్గరికి రానివ్వరు. నాన్న ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయనలాగే నేను కూడా నాస్తికురాలిని. విగ్రహారాధన చేయను. దేవాలయాలకు వెళ్లినా భక్తి ఉండదు. ఎప్పుడైనా చర్చిలకు వెళితే.. అక్కడ చక్కగా కూర్చుని వచ్చిపోయే వాళ్లను గమనిస్తుంటాను. అంతే! కొన్నిసార్లు వెలుగుతున్న కొవ్వుత్తుల వైపు చూస్తూ అలాగే ఉండిపోతాను. భక్తి లేకపోయినా నమ్మకాల మీద వ్యతిరేకభావన లేదు.
శృతీ అక్క
నిజం చెప్పాలంటే నా అంత అల్లరి ఇంకొకరు ఉండరు. నా చిలిపి చేష్టలతో చాలాసార్లు మా అక్క శృతిని ఏడిపించాను. ఇప్పటికీ అలాగే చేస్తుంటాను. అల్లరి అంటే బెంగళూరులో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తోంది. హాస్టల్‌లో ఉన్నప్పుడు.. ఒక రోజు నాకు బాగా బోర్‌ కొడుతోంది. ఏం చేయాలో దిక్కుతోచలేదు. టెర్రస్‌ మీదికి ఎక్కి ఒక పాత సూట్‌కేస్‌ తీసుకున్నాను. హార్స్‌ రైడింగ్‌ కోసం పెట్టుకునే హెల్మెట్‌ పెట్టుకున్నాను. సూట్‌కే్‌సతో పాటు నేను కూడా స్టెప్స్‌ మీద నుంచి జారుకుంటూ కిందికొచ్చాను. ఆ అల్లరిలో గది అద్దాలకు దగలగానే భళ్లున బద్ధలయ్యాయవి. ఆ సంఘటన చూసి అందరూ అవాక్యయ్యారు. చిన్నప్పుడు ఇలా నేను ఎక్కడున్నా ఇల్లుపీకి పందిరి వేసేదాన్ని. ఇక, వ్యక్తిత్వాల గురించి చెప్పాలంటే నాకంటే అక్కకు కాస్త ఇగో ఎక్కువ. నేను కొంచెం అబ్బాయిల్లా వ్యవహరిస్తుంటాను. తను పూర్తిగా వుమెన్‌లీగా అనిపిస్తుంది.