Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నాగరికత మరింత ఆధునికత సంతరించుకున్న తర్వాత, మానవ జీవితంలోని అన్ని అంశాలు సాంస్కృతిక వికాసంలో భాగమవుతున్న వేళ, కొన్ని కీలక సందర్భాలను గుర్తు చేసుకునేందుకు ప్రత్యేక దినాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజూ ఓ విశేష దినమే. నేడు అంతర్జాతీయ జనాభా దినోత్సవం. భూమిపై సమతుల్యతకు మానవ జనాభా అత్యంత ఆవశ్యకం. కానీ, అది కట్టు తప్పితే, ఇప్పుడు మనిషి అనుభవిస్తున్న సమస్యలకు మరికొన్ని సమస్యలు తోడవుతాయి.

ప్రస్తుతం ప్రపంచ జనాభా 720 కోట్లు కాగా, మరో పదేళ్ళలో అది 800 కోట్లకు చేరుకుంటుందన్న వాస్తవం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ఇది గుర్తెరిగిన ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాల్లో జనాభా విషయంలో ఆంక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా చైనా, జపాన్ వంటి దేశాల్లో పరిమిత సంతానానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. అందుకే ఇప్పుడక్కడ జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. పదేళ్ళుగా చైనాలో ఒకే బిడ్డ విధానం అమల్లో ఉంది. అందరూ మగబిడ్డనే కోరుకోవడంతో ఆ విధానం తాలూకు దుష్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

ఇక, 2055 నాటికి ఉత్తర అమెరికా, ఐరోపా, జపాన్ లోని వృద్ధుల సంఖ్య కన్నా చైనాలోని వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉండనుంది. జపాన్ లోనూ చాలా తక్కువ జననాలు నమోదవుతున్నాయి. సుమారు 13 కోట్లుగా ఉన్న జపాన్ జనాభా ఏటా పదిలక్షల మేర తగ్గిపోతోంది. 2060 నాటికి 9 కోట్ల మందైనా మిగలరన్న విషయం ఆందోళన కలిగించకమానదు. రష్యా, జర్మనీ దేశాలు పిల్లలు కనేవారికి ప్రత్యేక ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నాయి. జనాభా పెంచుకోవడానికే ఇదంతా!

భారత్ విషయానికొస్తే, జనాభా ఎప్పుడో వందకోట్లు దాటింది. ఇప్పుడు మన జనాభా 120 కోట్లు. జనాభా కారణంగా సమతుల్యత దెబ్బతిన్న దేశాల్లో భారత్ ఒకటి. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలు, ఆవాసాల కొరత, ఆహార లేమి, తలసరి ఆదాయ లోటు వీటన్నింటికి మూలకారణం అధిక జనాభా. ప్రపంచ ఆకలి సూచీ నివేదిక ప్రకారం ప్రపంచంలో నాలుగోవంతు ఆకలి పీడితులు భారత్ లోనే ఉన్నారట. విద్యకు నోచుకోని బాలల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

అయితే, ఇంతటి ప్రతికూలతలోనూ ఓ సానుకూలాంశం ఉంది. మానవ వనరుల రీత్యా మనం మెరుగైన స్థానంలోనే ఉన్నాం కాబట్టి, ఆ వనరులను సద్వినియోగపర్చుకుంటే దేశం పురోగామి పథంలో పయనించడం ఖాయమని నిపుణుల భావన.