Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

హైదరాబాద్ స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. స్థానికంగా మంచి పట్టున్న ఓ రాజకీయ పార్టీ అండ చూసుకుని గత కొన్నేళ్లుగా ఈ గ్యాంగ్ తన వికృత చేష్టలను కొనసాగిస్తూ వచ్చింది. కొన్నేళ్లుగా చేస్తున్నా.. ఒక్కరంటే ఒక్క బాధితురాలు కూడా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం గమనార్హం. పైపెచ్చు.. స్థానిక పోలీసులకు ఈ గ్యాంగ్ ఆగడాల గురించి స్థానికులు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించిన పాపాన పోలేదు. ఫలితంగా ఎంతోమంది అమ్మాయిలు బాధితులుగా మారి లోలోన కుమిలిపోయారు. అసలు ఈ స్నేక్ గ్యాంగ్ తమ అకృత్యాలను ఎలా కొనసాగించేవారో ఒకసారి పరిశీలిస్తే…
హైదరాబాద్ పాతబస్తీలోని పహాడీ షరీష్ పరిసర ప్రాంతాలైన షహీన్ నగర్, ఎర్రగుంట తదితర ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. దీంతో సరదాగా కాసేపు సేద తీరేందుకు అనేక మంది జంటలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడకు వారాంతపు సెలవు రోజుల్లో ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. షహీన్ నగర్‌లో ఉండే పైజల్ దయానీ(స్నేక్ గ్యాంగ్ సూత్రధారి) అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి తన దందాలను కొనసాగిస్తూ వచ్చాడు. ముఖ్యంగా.. ఎవరైనా జంటలు గానీ, అమ్మాయిలుగానీ షహీన్ నగర్‌లో… ఆ పరిసర ప్రాంతాల్లో ప్రవేశించగానే, అక్కడ ఉండే ఆయనకు అనుచరుల నుంచి క్షణాల్లో సమాచారం చేరిపోతుంది. ఆ వెంటనే.. తమ వద్ద ఉన్న పాములను తీసుకుని గుర్రాలు, ద్విచక్రవాహనాలపై ఈ గ్యాంగ్ బయలుదేరి… సదరు స్థలానికి చేరేది.
ఇక, ఆ తర్వాత రాతల్లో వ్రాయడానికి కూడా వీల్లేని విధంగా అమ్మాయిలను చిత్రహింసలకు గురిచేసి.. వివస్త్రలను చేసి… భయపెట్టి అత్యాచారం జరిపేవారు. ఒకరు అత్యాచారం చేస్తుంటే.. మరొకరు తాపీగా వీడియో తీసేవారు. బాయ్‌ఫ్రెండ్ ఉంటే అక్కడే ఓ చెట్టుకు కట్టేసేవారు. ఒకవేళ బాధితుల్లో ఎవరైనా పోలీసులకి కంప్లైంట్ చేస్తామని చెపితే.. చిత్రీకరించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరిస్తూ తమ ఆగడాలను యధేచ్చగా కొనసాగిస్తూ వచ్చారు. ఇలా ఈ రాక్షసకాండ గత కొన్నేళ్లుగా జరుగుతూ వచ్చింది.
దీనికంతటికీ కారణం ఓల్డ్ సిటీలో మంచి పట్టున్న ఓ రాజకీయ పార్టీ వీరికి అండగా ఉండటమేననే వాదన వినబడుతోంది. ఆ పార్టీ అండతోనే ఈ ప్రాంతంలో వీరి ఆగడాలకు ఇన్నాళ్లూ అడ్డూఅదుపు లేకుండా సాగిపోయింది. ఫలితంగా రాజకీయ ప్రాబల్యం కారణంగా స్థానికులకు కూడా వీరంటే భయం ఏర్పడింది. దీంతో, స్నేక్ గ్యాంగ్ విషయం తెలిసినా కూడా వారు ఇన్నాళ్లు నోరుమెదపలేదు.
మరోవైపు స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్‌కు, అక్కడి ఉన్నతాధికారులకు రెండేళ్ల నుంచి తెలుసు. ఈ విషయాన్ని స్థానికులే కాదు.. ఆ పీఎస్‌లో పనిచేసే కొంతమంది కానిస్టేబుళ్లు సైతం అంగీకరిస్తున్నారు. తమకు ఈ అకృత్యాల గురించి చాలాకాలం నుంచే తెలుసునని… ఈ విషయాల్ని పీఎస్‌లో ఉన్నతాధికారులకి రెండుమూడుసార్లు నివేదిస్తే వారు తమను వేధించడం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉన్నతాధికారులకు చెప్పిన విషయం వెంటనే స్నేక్ గ్యాంగ్ సభ్యులకు తెలిసిపోయేదని… ఆ తర్వాత వారు తమ మీద దాడి కూడా చేశారని వారు పేర్కొన్నారు.
ఇక్కడ పైసల్ దయానీ స్నేక్ గ్యాంగ్ ఒక్కటే కాదనీ, ఇలాంటి గ్యాంగ్‌లు ఇక్కడ చాలా ఉన్నాయని వారు అంటున్నారు. ఇక స్థానికులు కూడా పహాడీ షరీఫ్‌లో పోలీసింగ్ ఏమాత్రం ఉండదని… స్నేక్ గ్యాంగ్ చేసే ఘోరాల గురించి పోలీసులకి చెబితే తమ మీద దాడులు జరిగేవని అంటున్నారు. ఏదో ఒకరోజు వచ్చి పోలీసులు హడావుడి చేసి వెళ్లిపోయేవారని స్థానికులు చెపుతున్నారు. మరి టోటల్ గా పిల్ల పాము గ్యాంగ్ ల నుంచి పెద్ద పాము గ్యాంగ్ ల వరకూ పోలీసులు పట్టుకుని వారి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాల్సి ఉంది.