Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆమె ఒంట‌రి.. అయినా ధీశాలి. త‌మిళనాడులో దిగువ తరగతి ప్రజలకు అమ్మ, మధ్య తరగతి ప్రజలకు పురచ్చితలైవి. అంటే విప్లవనాయకురాలని! ఆమె జీవితమంతా వివాదాస్పదమైనదే. స్కూలు రోజుల నుండి ఆమె జీవితం పోరాటమయమే! కుటుంబాన్ని పట్టించుకోకుండా తండ్రి జయరామన్‌ వదిలేస్తే తల్లి బలవంతం మీద సినిమాల్లోకి వెళ్లింది! ఆమె పేరు జయలలిత. అసలు పేరు కోమలవల్లి. కర్నాటక పాండవపురం జిల్లాలోని మేలుకోటే జయలలిత తండ్రి, తల్లి ఉండే వారు. అచ్చమైన బ్రాహ్మణ కుటుంబం వారిది.

పెద్దమ్మ ఆర్టిస్టు కావడంతో తల్లి ఆమెను ఆర్టిస్టు చేయాలని పట్టుబట్టి ఆర్టిస్టుని చేసింది. ఆమె చేసిన తొలి కన్నడ చిత్రం ‘చిన్నడగొంబె’. అనంతర కాలంలో కర్నాటక నుండి మద్రాసుకు కూతురుతో వలస వచ్చిన తల్లి ‘సంధ్య’గా పేరు మార్చుకుని సినిమాల్లో నటించడంతో వేదవల్లి కూడా తన 15వ ఏట ఆర్టిస్టుగా మారింది.

తెలుగులో ఆమె మొదటి సినిమా ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ వారి ‘మనుషులు మమతలు’ చిత్రం. ఆ తొలి చిత్రం తర్వాత జయలలితగా మారి వరుసగా 40 తెలుగు చిత్రాలలో నటించారు. కాగా తమిళంలో ఎమ్‌.జి.రామచంద్రన్‌తో ఎక్కువగా నటించడం జరిగింది. తెలుగులో ఎన్టీఆర్‌తో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలలో నటించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావుతోనూ ఎక్కువగా నటించారు.

తమిళ చిత్రాలో నటిస్తుండగానే నాటి తమిళ సూపర్‌స్టార్‌ ఎమ్‌.జి.ఆర్‌తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం మూలంగా జయ రాజకీయ రంగప్రవేశం చేశారు. అన్నాడి.ఎంకేకు ప్రధాన కార్యదర్శిగానూ చేశారు. అయితే ఎమ్‌.జి.ఆర్‌ మరణం తర్వాత ఆమె కష్టాలు ఆరంభమయ్యాయి. పార్టీలోని ప్రధాన కార్యదర్శి పదవి నుండి తొలగించడానికి పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా కృషి చేసింది. కానీ ధీశాలి, మహాపట్టుదల గల మనిషి, ఎవరినైనా ఎలాంటి వారినైనా ఎదుర్కొని పోరాడే ధైర్యసాహాసాలు కలిగిన వ్యక్తి కావటంతో తనంతట తానే అన్నాడీఎంకే అధినేతగా ప్రకటించుకుంది. తన అభిమానుల చేత విప్లవనాయకురాలు(పురచ్చితలైవి), లేడీ టైగర్‌ అని వేనోళ్ల పొగడబడే జయలలిత… నిజం చెప్పుకోవాలంటే ఇంగ్లీష్‌లో అయితే ‘యారగంట్‌’ అనాలి!

జయలలితది అంతా ఒంటరి జీవితం… ఒంటరి పోరాటం. అయినా కరుణానిధి వంటి రాజకీయ దురంధరుని ఎత్తులకు, రాజకీయ కుయుక్తులకు ఎదురునిలిచి జీవితమంతా పోరాడుతూనే ఉంది. ఈ పోరాటంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. కడుపుకోతననుభవించారు. నిండు అసెంబ్లీలో ఆమె చీరను లాగి దారుణంగా అవమానించారు. ‘నిన్ను జైలుకు పంపిచిప్పకూడు తినిపిస్తా’ అని అన్న నాటి ముఖ్యమంత్రి కరుణానిధి అన్నంతపనీ చేసి జైలులో పెట్టించారు! అంతటి రాజకీయవేత్తయిన కరుణానిధి తన రాజకీయ ప్రసంగాలలో తరచూ ఒక ప్రముఖ తెలుగు సినిమా హీరో ప్రసక్తిని తెస్తూ దారుణమైన వ్యక్తిగత దూషణలు చేసేవారు. ఒక కేసులో కర్నాటక దిగువ కోర్టు, ముఖ్యమంత్రి పదవి నుండి ఆమెను పదవీచ్యుతిరాలిని చేస్తూ, అసలు రాజకీయాల్లో తిరిగి పోటీ చేయడానికి వీల్లేకుండా తీర్పు ఇచ్చినా పోరాడి హైకోర్టులో గెలిచి, మళ్లీ ప్రజల ముందుకెళ్లి తిరిగి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు! దటీజ్‌ జయలలిత. ఆమె పెంపుడు కుమారుని పెళ్లి అత్యంత వైభవంగా జరిపినందుకే ఆమెపై కేసులు పెట్టారు. వివిధ కోర్టులలో ఆమెపై మొత్తం 11 కేసులుండగా.. 9 కేసులలో గెలిచారు. ఇంకా రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి ఎమ్‌.జి.ఆర్‌కు ఎంత సన్నిహితంగా ఉన్నా.. జీవితాంతం అవివాహితగానే ఉండిపోయారు. ఒక విధంగా సూపర్‌ లేడీగా పేరొందినా… వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె శాపగ్రస్తురాలు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఒంటరిగా పోరాడి గెలిచినా.. ఆ విధి ముందు తలవంచక తప్పలేదు! అమ్మ అస్త‌మించారు. ఇక ఎన్న‌టికీ తిరిగిరాని లోకాల‌కు వెళ్లినా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచారు.