Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పుట్టిన ప్రతి పాపకూ తల్లే తొలిగురువు. ఏది మంచి? ఏది చెడు? ఎవరితో ఎలా మెలగాలి? ఏయే సందర్భాలలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నీ తల్లి నుంచి, తండ్రి నుంచీ నేర్చుకుంటారు పిల్లలు. ఏదైనా ‘మొక్కై వంగనిదే మానై వంగదు’ అన్నట్లు చిన్నారులను బాల్యం నుంచే మలచాలి. మంచి అలవాట్లన్నిటినీ చిన్నతనం నుంచే రంగరించి, వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేది అమ్మానాన్నలే. వారితో పాటు కుటుంబంలోని ఇతర పెద్దలు కూడా.
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల ఈ నేర్పించే బాధ్యతను అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు కొంతవరకు పంచుకోగలిగేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ చిన్న కుటుంబాలే అవడంతో మొత్తం బాధ్యతనంతా తల్లిదండ్రులే స్వీకరించవలసి వస్తోంది. మంచి అలవాట్లతో పాటు ఇప్పుడు అదనంగా తమ పిల్లలకు ఆర్థికపరమైన అవగాహన కల్పించడం కూడా తల్లిదండ్రుల కనీస బాధ్యత అవుతోంది. పొదుపు చేయడం, ఆ పొదుపు మదుపు మార్గంలోకి వెళ్లేలా చూడడం ఇప్పటి తరానికి నేర్పించవలసి అవసరం ఎంతైనా ఉంది. కనుక మీ చిట్టిపొట్టి చిన్నారులకు అర్థికపరమైన ఈ అవగాహనను ఎలా కల్పించాలో, అందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఈవారం చూద్దాం.
సాధారణంగా పిల్లలకు పండుగ సందర్భాలలో, పుట్టిన రోజు కానుకగా, అలాగే.. బంధువులు వచ్చి వెళ్లేటప్పుడు, లేదా వీళ్లే బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు ఎంతో కొంత డబ్బు చేతికి అందుతుంటుంది. అలా చేతికి అందిన డబ్బును వారు పొదుపు చేసే విధంగా ఒక పిగ్గీ బ్యాంకును కొని ఇచ్చి అందులో దాచుకోవడాన్ని పిల్లలకు అలవాటు చేయండి.
ఆ పిగ్గీ బ్యాంకులో ఒక నిర్ణీత మొత్తం జమ అయ్యాక, వారు అప్పటివరకు దాచినందుకు బహుమతిగా మరికొంత డబ్బను వారికి ఇవ్వండి. దీంతో వారికి మరింత ఎక్కువ డబ్బును దాయాలన్న కోరిక కలుగుతుంది.
నెలనెలా ఎంతో కొంత చిన్న మొత్తమైనా సరే, పాకెట్ మనీలాగా ఇచ్చి ఎవరు ఎక్కువ కూడబెడతారో చూద్దాం అనే ఒక విధమైన పోటీ తత్వాన్ని పిల్లల్లో కలిగించండి.
ఈ రోజుల్లో చాలా బ్యాంకులు పిల్లల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వాటిలో పిల్లలకు బ్యాంకు ఖాతాలను ప్రారంభించి, వారు పిగ్గీ బ్యాంకులో దాచిన డబ్బును ఆ ఖాతాలలో జమ చేయడాన్ని అలవాటు చేయండి.
పిగ్గీ బ్యాంకులో దాచిన సొమ్ముకు, బ్యాంకు ఖాతాలో జమ చేసిన సొమ్ముకు మధ్య తేడాను వారు గ్రహించేలా చూడండి. పిగ్గీ బ్యాంకులో ఉన్న డబ్బుకు వడ్డీ రాదు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుకు వడ్డీ వస్తుంది.
పిల్లలు పెరుగుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా మదుపు చేయడానికి అందుబాటులో ఉన్న వివిధ మార్గాలను, వాటిలోని అనుకూలాంశాలను విశ్లేషించి చెబుతూ వాటిల్లో పెట్టిబడి పెట్టించండి.
ఇలా చిన్నతనం నుంచే పిల్లలకు పొదుపును అలవాటు చేయడం ద్వారా బ్యాంకు ఖాతాల నిర్వహణ మీద కూడా వారికి అవగాహన కల్పించినవాళ్లం అవుతాం.
పిల్లలకు చిన్నతనం నుంచే.. ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి, జీవితంలో స్థిరపడడం వంటి వాటికి ఎంత డబ్బు అవసరం అవుతుందో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, క్రమం తప్పకుండా వారి చేత ఎంతో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టిస్తూ ఉంటే భవిష్యత్తులో వారు ధైర్యంగా ముందుకు సాగిపోగలుగుతారు. సమర్థవంతమైన వ్యక్తులుగా కూడా సమాజంలో నిలబడగలుగుతారు.