Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎబోలా, ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి. గతంలో ఎయిడ్స్ వెలుగు చూసిన సమయంలోనూ ఇంతగా భయపడని అమెరికా లాంటి దేశాలు ఎబోలా పేరు వింటేనే వణికిపోతున్నాయి. ఒక్కసారి సోకిందంటే ప్రాణాలను హరించేదాకా విశ్రమించని ఈ వైరస్, ఇప్పటికే 932 మందిని పొట్టనబెట్టుకుంది. అసలు ఎబోలా సోకిన తన పౌరులను కాపాడుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా చేసిన యత్నం, ఆ దేశ పౌరులను ఆగ్రహావేశాలకు గురి చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. చికిత్సే లేని ఎబోలా వ్యాధి నుంచి దూరంగా పారిపోవడం మినహా, సోకిన తర్వాత చేయగలిగిందేమీ లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. అంతేనా, ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు కూడా వైద్య వర్గాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే ఎబోలా సోకిన రోగులకు చికిత్స చేస్తున్న క్రమంలో ఓ వైద్యుడితో పాటు సదరు క్లినిక్ లో పనిచేసిన ముగ్గురు నర్సులు కూడా ఈ వ్యాధి బారినపడి చనిపోయారు.

భారత్ నుంచి వివిధ పనుల నిమిత్తం విదేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. అయితే ఎబోలా వ్యాప్తి కనిపించిన దేశాల్లో మాత్రం 45 వేల మందికి పైగా ప్రవాస భారతీయులున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదేదో ప్రైవేట్ సంస్థలు వెల్లడిస్తున్న విషయం ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్ కు చెప్పిన లెక్కలు. ఎబోలా కరాళ నృత్యం చేస్తున్న లైబీరియాలోనే ఐక్యరాజ్య సమితి సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారిలో 300 మంది భారత్ కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లున్నారు. వీరితో పాటు 2,700 మంది భారతీయులు ఇతర పనుల నిమిత్తం లైబీరియాలో ఉన్నారు. సియోర్రాలియోన్ లో 1,200 మంది, గినియాలో 500 మంది భారతీయులు ఉన్నారు. నైజీరియాలో పెద్ద సంఖ్యలో 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఈ దేశాలన్నీ ప్రస్తుతం ఎబోలా వ్యాప్తితో సతమతమవుతున్న దేశాలే.

ఈ దేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తే, పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన నేపథ్యంలో కేంద్రం, ఈ గణాంకాలను సేకరించింది. అయితే మన పౌరులు ఎబోలా బారిన పడకుండా దేశానికి తిరిగివస్తే, ఎలాంటి సమస్యా లేదు. అయితే పొరపాటున వ్యాధి సోకిన తర్వాత వస్తేనే అసలు సమస్య. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.