Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ ‘జనసేన’ అనే పార్టీ పెట్టి ప్రజా క్షేత్రంలోకి వచ్చాడు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైస్సార్సీపీ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని ప్రజలు భావించారు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంతో రాజకీయ సమీకరణాలు మారతాయని అందరూ భావించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న వ్యక్తుల చేతుల్లోనే ఉండాలని, తాను పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి అనుభవం లేని పార్టీలు అధికారంలోకి రావచ్చు అని ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బీజేపీలకు ఆయన మద్దతు తెలిపారు. దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది.

కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే రోజుకో రకంగా మారిపోతూ ఊసరవెల్లిని తలపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు ప్రజలకు ఇచ్చిన హామీలు చూసి ఆ పార్టీలను గెలిపించాలని ప్రజలను కోరారు. కానీ ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలకు మంగళం పాడేశాయి. ప్రధానంగా భారత ప్రధాని మోడీ తాను ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి అనుకున్నట్టుగానే మోడీ భారత ప్రధాని అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంబరపడిపోయారు. ఆయన అన్న మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే సాక్షాత్తూ ప్రధాన మంత్రి మోడీ కూడా మాట తప్పుతారని ఎవరూ ఊహించలేదు. ఆయన అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని, అందువల్ల ప్రత్యేక ప్యాకెజీ ఇస్తామని చిలుక పలుకులు పలికారు.

అప్పటికే ప్రభుత్వంపై రగిలిపోతున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ కు ఈ ప్రకటన వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారని, ఓటుకు నోటు కేసులో ఆయన కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిపోయారని, అందుకే కేంద్రం చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు నడుచుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా వచ్చేవరకు తాను నిద్రపోనని శపధం చేశారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేక హోదా విషయంలో జగన్ కంటే ముందున్నారు. అప్పటివరకు మౌనంగా రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలను పరిశీలించిన పవన్ ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు పడదు అని కేంద్రం చెప్పగానే ఒక్కసారిగా తన జూలు విదిల్చారు. తన విశ్వరూపాన్ని చూపారు. ప్రత్యేక హోదా కోసం ఏకంగా కేంద్రంతోనే యుద్దానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే మూడు బహిరంగ సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దూరంగా జరుగుతున్నారు.

ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోరు తప్పేలా కనపడట్లేదు. కమ్యూనిస్ట్ నాయకులూ అవసరమైతే తాము ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీతో కలిసి ప్రయాణిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తన ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. దాంతో అందరూ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏలూరు నుండి పోటీ చేస్తారని అనుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో కులాల వారీగా ఓట్లు చీలిపోయి ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పడం ఆ దేవుడి తరం కూడా కాదు.