Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వాహన రంగానికి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద దేశం మనదే. పైపెచ్చు మన జీడీపీలో 7.1 శాతం వాటా ఈ రంగానిదే. అంతేకాదు! ఏటా దేశంలో వ్యక్తిగత, వాణిజ్య, ద్విచక్ర అన్ని రకాల వాహనాలు కలిపి రెండు కోట్లకు పైనే తయారవుతున్నాయి. ఇదీ ఇక్కడ వాహన రంగానికున్న ప్రాధాన్యం.

నిజం చెప్పొద్దూ!! ఇపుడు దేశంలో వాహనాలపై పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా అన్నీ కలిపి 32 నుంచి 55 శాతం వరకూ ఉన్నాయి. జీఎస్‌టీలో మాత్రం ఎలక్ట్రిక్‌ కార్లు, బైకులు, ట్రాక్టర్లను మినహాయిస్తే అన్ని రకాల వాహనాలనూ 28 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. సెడాన్, లగ్జరీ కార్లకు మాత్రం జీఎస్‌టీకి అదనంగా 1–15 శాతం వరకు సెస్సు జత చేశారు. మరి జీఎస్‌టీ రాకతో వాహన ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? దీనికి పలువురు నిపుణులు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం.

చిన్న కార్ల తయారీలో మనమే టాప్‌. దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో 45 శాతానికి పైగా అమ్మకాలు చిన్న కార్లవే. ప్రస్తుతం ఈ విభాగంపై 25–27.5 శాతం వరకూ పన్నులున్నాయి. తాజా జీఎస్‌టీలో సెస్సుతో సహా కలిపి ఇవి 29 శాతానికి చేరుతున్నాయి. అంటే 1.5 నుంచి 2 శాతం పెరుగుతున్నట్లే. అంటే జీఎస్‌టీతో చిన్న కార్ల ధరలు స్వల్పంగా పెరుగుతాయన్న మాట. హోండా సిటీ, క్రెటా, సియాజ్, డస్టర్‌ వంటి సెడాన్, ఎస్‌యూవీ వాహనాల పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ప్రస్తుతమున్న పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా పన్నులు 43 శాతం. జీఎస్టీలో 28 శాతానికి అదనంగా 15 శాతం సెస్సును విధించారు. ఎలా చూసినా 43 శాతమే కనక ధరల్లో మార్పుండదు.

లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయ్‌..
ప్రస్తుతం మెర్సిడెజ్‌ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్, వోల్వో వంటì లగ్జరీ కార్లకు ఎక్సైజ్, వ్యాట్, ఇన్‌ఫ్రా సెస్‌ కలిపి 55 శాతం వరకూ పన్నులున్నాయి. జీఎస్‌టీ 28 శాతానికి 15 శాతం సెస్సు కలపాల్సి ఉంది. అంటే పన్నులు 43 శాతానికి దిగి వస్తాయి. అంటే జీఎస్‌టీతో వీటి ధరలు దాదాపు 10–12 శాతం తగ్గుతాయన్న మాట. అయితే లగ్జరీ కార్లు కొనేవారు ఈ స్థాయి తగ్గింపుల్ని పట్టించుకోరన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అందుకని జీఎస్‌టీ ప్రభావం వాహన రంగంపై మరీ ఎక్కువగా ఏమీ ఉండబోదని వారు చెబుతున్నారు.
హైబ్రిడ్‌ వాహనాలకు షాక్‌..
పర్యావరణాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. కానీ, తాజా జీఎస్‌టీలో పర్యావరణ అనుకూలమైన హైబ్రిడ్‌ వాహనాలకు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదు. పైపెచ్చు ఎస్‌యూవీలను, హైబ్రిడ్‌ వాహనాలను ఒకే గాటన కట్టేశారు. దీంతో వీటిక్కూడా 43 శాతం పన్ను వర్తిస్తుంది. కార్లలో పెట్రోల్, డీజిల్‌ వాహనాల పన్ను రేట్లు పరిశీలించినా 29–31 శాతానికి పరిమితం కావటం గమనార్హం. హైబ్రిడ్‌ వాహనాలంటే రెండు రకాల ఇంధనాలతో నడిచేవి. అంటే పెట్రోల్‌ లేదా డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్‌ ఆప్షన్‌ కూడా ఉండేవి.

ఎలక్ట్రిక్‌ వాహనాలకు మాత్రం శుభవార్తే..
ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం 6 శాతం పన్ను విధిస్తోంది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే కొన్ని మినహాయిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు 12 నుంచి 21 వరకూ వ్యాట్‌ను వసూలు చేస్తున్నాయి. జీఎస్‌టీలో 12 శాతం పన్ను విధిస్తుండటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ధరలు స్వల్పంగా పెరిగినా… చాలా రాష్ట్రాల్లో బాగా తగ్గుతుందన్నది నిపుణుల మాట. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలపై వ్యాట్‌ లేదు. జీఎస్టీలో 12 శాతం పన్ను విధింపుతో వీటికి నిరాశే. పన్నులెక్కువగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ (ప్రస్తుతం 20.5 శాతం), తమిళనాడు (20.5), గుజరాత్‌ (21) రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గే అవకాశముంది.

అధిక సామర్థ్యం ఉంటే పెంపు!
350 సీసీ ఇంజిన్‌ కెపాసిటీ కంటే ఎక్కువుండే ద్విచక్ర వాహనాలకు 28 శాతం జీఎస్‌టీ రేటుతో పాటు అదనంగా 3 శాతం సెస్సునూ జత చేశారు. మొత్తంగా 31 శాతానికి చేర్చారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలకు 13 రకాల పన్నులు కలిపి సుమారుగా ఇది 28–35 శాతంగా ఉంది. అంటే దీనర్థం జీఎస్‌టీతో ప్రభావం ద్విచక్ర వాహనాలపై పెద్దగా ఉండకపోవచ్చు.

ట్రాక్టర్లపై పన్ను తగ్గింది
వ్యవసాయంలో రైతుకు కుడి భుజంలా ఉపయోగపడే ట్రాక్టర్లపై పన్ను రేటు తగ్గించి రైతుకు భరోసానిచ్చారు. జీఎస్‌టీలో ట్రాక్టర్లకు 12 శాతం రేటును ఖరారు చేశారు. ప్రస్తుతం ట్రాక్టర్లపై వ్యాట్‌ (5–5.5 శాతం), సీఎస్టీ (2 శాతం), విడిభాగాలు, పరికరాలపై సెంట్రల్‌ వ్యాట్‌ (12.5 శాతం)గా ఉంది. దీనర్థం ట్రాక్టర్ల ధరలు కొంత దిగిరావచ్చు. దేశంలో 2015–16లో 4,93,764 ట్రాక్టర్లు అమ్ముడుపోగా.. 2016–17 నాటికి 5,82,844 యూనిట్లకు చేరిందని ట్రాక్టర్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ గణాంకాలు చెబుతున్నాయి.

10 నుంచి 13 సీట్ల సామర్థ్యం ఉండే ప్రజా రవాణా వాహనాలను కూడా లగ్జరీ కార్ల మాదిరే చూడటం సరికాదు. రెండింటికీ ఒకే తరహా పన్ను వేయటం ఇబ్బందికరమే. – ఆర్‌సీ భార్గవ, మారుతీ సుజుకీ చైర్మన్‌