Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత వైమానిక దళం పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌​ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్ర రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న జైషే ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో 12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌ బాంబుల వర్షం కురిపించాయి. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు సర్జికల్‌ స్ట్రైక్స్‌-2ను విజయవంతం చేశాయి. కాగా, రాజస్థాన్‌లోని చురులో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 నేపథ్యంలో మోదీ ప్రసంగిస్తున్న సమయంలో సభికులు పెద్ద ఎత్తున మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. (‘మిరాజ్‌’.. భారత్‌ వజ్రాయుధం)

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశం అసలైన నివాళులర్పించిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తడంతో మోదీ పరవశించిపోయారు. అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి పాక్‌ను చావుదెబ్బ కొట్టిన భారత వైమానిక దళానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనా దేశాన్ని కిందపడనీయను అంటూ ఉద్వేగంగా ప్రసంగం ప్రారంభించారు. ‘దేశ ప్రజలకు మాట ఇస్తున్నాను. భారత్‌ తమ చేతుల్లో పదిలంగా ఉంటుంది’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ఓ కవిత చదివి వినిపించారు.

ప్రధాని కవితలోని ముఖ్యాంశాలు..
‘నా జన్మభూమిపై ప్రమాణం చేసి చెప్తున్నా..
దేశాన్ని ఎన్నడూ అవస్థలపాలు కానివ్వనని..
నా దేశం ఎదుగుదలను అడ్డుకునే శక్తులను ఎదుర్కొంటానని..
నా దేశాన్ని ఎక్కడా తలవంచనీయనని..
ప్రమాణం చేసి చెప్తున్నా..

భరతమాతకు మాట ఇస్తున్నా..
మీరెప్పుడూ తలదించుకునేలా చేయనని..

మాతృభూమికి మాట ఇస్తున్నా..
నా దేశాన్ని ఎక్కడా తక్కువ కానివ్వనని..
గర్వంగా చెప్తున్నా..నా దేశం జాగృతమైనదని..
నా దేశ ప్రజలందరూ విజయం సాధిస్తారని..

ప్రమాణం చేసి చెప్తున్నా..
ఇప్పుడే కాదు.. నా దేశం జోలికొస్తే.. ఊరుకునేది లేదు..
ఈ విషయం ప్రత్యర్థుల గుండెల్లో నిలిచి ఉంటుంది..
నా దేశం జోలికొస్తే.. ఊరుకునేది లేదు..వెనకడుగు వేసేది లేదు..
ఏదేమైనా.. నా దేశాన్ని కిందపడనీయనని మాట ఇస్తున్నా..’ అంటూ ముగించారు.