Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘‘శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్య శ్రవణ కీర్తనః
హృద్యన్థః స్థోహ్య భద్రాణి విధునోతి సుహృత్సతామ్‌’’
‘‘పుణ్య శ్రవణకీర్తనుడు, సత్పురుషులను రక్షించువాడు అగు శ్రీకృష్ణ భగవానుడు, తన కథలను శ్రవణము చేయువారి హృదయములలో నుండి పాపవాసనలను నశింపజేయును’’ అని సూతమహర్షి తెలియచేశాడు. నవవిధ భక్తి మార్గాలలో మొదటిది శ్రవణభక్తి. చెవి జ్ఞానేంద్రియములలో ఒకటి. ‘‘భద్రం కర్ణేభిః శృణు యామదేవాః’’ అను అధర్వణశ్రుతిని బట్టి శ్రవణ భక్తికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జన్మకు సార్థకం లేనటువంటి మాటలు వినడం కంటే భగవంతుడి నామ, చరిత్రలు విన్నప్పుడే భద్రం కలుగును. శాస్త్ర శ్రవణం చేతనే మనిషి ధర్మాన్ని తెలుసుకుంటాడు. దుష్టబుద్ధులు విడిచి జ్ఞానము పొందుతాడు. అర్జునుడు శ్రీకృష్ణుని ధర్మ ప్రబోధమును శ్రవణముచే గ్రహించి కీర్తిని గడించాడు. ‘‘నేను మరణిస్తాను’’ అనే భయంతో తపించే పరీక్షిత్తు శుకమహాయోగి వినిపించిన భాగవతము విని బంధవిముక్తుడైనాడు.

‘‘భాగవతుల సేవచేత, భాగవతము శ్రవణము చేయుట చేత, కీర్తనము చేయుట చేత అమంగళములు నశిస్తాయి. పురుషోత్తముడగు కృష్ణుని యందు అచంచలమైన భక్తి కలుగుతుంది’’ అని భాగవత ప్రథమ స్కందంలో తెలుపబడింది. ‘‘భగవన్నామము చెవిన బడిన వెంటనే ఎవ్వనికి పులకాంకురమగునో, ఎవ్వని కన్నుల నుండి ఆనందబాష్పములు ప్రవహించునో అట్టివానికి అదియే తుది జన్మము’’ అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస. ఇక.. చెడ్డ మాటలు వినడం వలన కష్టాలు, అపవాదులు కలుగుతాయి. మంధర మాటలు విన్నందునే కైకేయి దుర్భావముతో అపవాదులపాలై వైధవ్య దుఃఖం పొందింది. భక్తిలేని శ్రవణము అంకె లేని సున్నావంటిది. భక్తితో కూడిన శ్రవణము అత్యవసరమైనదని భావించాలి.

‘‘శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన,
దానేన పాణిర్న తు కంకణేన,
విభాతికాయః కరుణాపరాణాం,
పరోపకారేణ న చందనేన.’’
సజ్జనులు కుండలములు ధరించుటచే గాక, వేదశాస్ర్తాదులను వినుట చేతనే చెవులను సార్థక మొనర్చుకుంటారు. చేతులను కంకణాదులచేగాక దాన మొనర్చుట చేతను, శరీరమును చందనాది మైపూతల చేగాక పరోపకారము చేతనూ ప్రకాశవంత మొనర్చుకుంటారని, భర్తృహరి ‘నీతిశతకం’ చెబుతున్నది. కమనీయ కథా శ్రవణము మనస్సులో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, వెలుతురురాగానే అంధకార మదృశ్యమైనట్లు అంతవరకు మనస్సునావరించిన కల్మషములు కూడా సమసిపోతాయి. కల్మషములనెడి కలుపుమొక్కలు మనో క్షేత్రము నుండి ఎపుడైతే పెకలింపబడినవో, అచ్చటనే ఆధ్యాత్మిక జీవన వృక్షం మొలకెత్తి, ఆత్మానంద ఫలాన్నిస్తుంది. కనుక కథామృత పానం వల్ల మానవుని మస్తిష్కంలో ఉన్న సకలపాపాలు, కల్మషాలూ హరించిపోతాయి.