Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సంచలన ప్రకటన చేసింది. ఇకపై శ్వేత జాతీయవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఎంత మాత్రం సహించనని స్పష‍్టం చేసింది. అలగే ఎలాంటి జాతి విద్వేషాన్ని, జాత్యహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను తమ ప్లాట్‌ఫాంపై అనుమతించబోమని వెల్లడించింది. వచ్చేవారం నుండి అమలుకానున్న ఈ నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్‌కు కూడా వర్తిస్తుందని ఫేస్‌బుక్‌ తెలిపింది.

వ్యక్తులు, సంస్థలు ఫేస్‌బుక్‌తో తమ వ్యవస్థ, జాతి గొప్పతనం గురించి ప్రకటనలు చేయవచ్చు కానీ ఇవి మరొకరిని కించపరచకూడదని స్పష్టం చేసింది. దీంతోపాటు తీవ్రవాద గ్రూపుల సమాచారాన్ని గుర్తించి బ్లాక్ చేయగల సామర్థ్యాన్ని పెంచుకుంటామని వివరించింది. అలాగే ఇలాంటి వాటి గురించి శోధించే ఖాతాదారుల సమాచారాన్ని టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలకు అందిస్తామని కూడా ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్‌ మసీద్‌లో శ్వేత జాతి ఉన్మాది సృష్టించిన మారణహోమంపై స్పందించిన ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 50 మందిని పొట్టనబెట్టుకున్న ఈ కాల్పులను ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. దీనిపై న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై నెలకొన్న ఒత్తిడి నేపథ్యంలో స్పందించిన ఫేస్‌బుక్‌ 24 గంటల్లో 1.2 మిలియన్ల వీడియోలను బ్లాక్ చేయడంతోపాటు, 3 లక్షల వీడియోల అప్‌లోడింగ్‌ను నిరోధించామని కూడా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.