Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

లేపాక్షి శిల్పకళా సంపదను తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడిగులు మాత్రమే తెలుసుకున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు లేపాక్షి తెలుసు కానీ ఇక్కడున్న పూర్తీ చరిత్ర తెలియదు. అలాంటిది శిల్పకళా సంపదకు సంబంధించి క్షుణ్ణంగా విశ్వ వ్యాప్తంగా తెలియజెప్పడానికి గిన్నీస్‌ బుక్‌ రికార్డు గ్రహీత, హిందూపురానికి చెందిన వినోద్‌ రాజేంద్ర శ్రీకారం చుట్టాడు. రైల్వే శాఖలో ఓ చిరుద్యోగి రాజేంద్రనాయుడు, వానీల కుమారుడు వినోద్‌ రాజేంద్ర. బీటెక్‌ పూర్తి చేసిన ఈ యువకుడు తన పది మంది స్నేహితులతో కలిసి ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. మన చరిత్ర, సంస్కృతిని కోట్లాది మందికి చేర్చే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటిగా లేపాక్షిలోని శిల్పకళలకు సంబంధించి ప్రతి బొమ్మకు ఒక చరిత్ర క్షుణ్ణంగా అధ్యాయనం చేసి ‘కుతాస్థ ప్రాజెక్ట్‌’ ద్వారా వెబ్‌లో ఉంచడం ఈ యువకుడి లక్ష్యం. ఇప్పటికే వినోద్‌ రాజేంద్ర లేపాక్షిపై తీసిన డాక్యుమెంటరీపై అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా 11 భాషల్లో లేపాక్షి ఆలయంపై డాక్యుమెంటరీ తీసి 2015 సంవత్సరంలో రెండు గిన్నీస్‌ రికార్డులు సొంతం చేసుకున్నాడు.
లేపాక్షి చరిత్ర ప్రపంచానికి తెలియాలి
ఇప్పటి వరకు లేపాక్షికి సంబంధించిన చరిత్ర పుస్తకాల రూపంలో ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ లేపాక్షిలో ఉన్న శిల్పకళా సంపదకు సంబంధించి అణువణువూ తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో కుతాస్థ ప్రాజెక్ట్‌ ద్వారా ఫేస్‌బుక్‌లో గ్రూప్‌ క్రియేట్‌ చేశాం. ఇప్పటికే ఉన్న లక్షలాది మంది ఫాలోవర్స్‌ ద్వారా అన్ని దేశాలకు దీనిని వ్యాపింపజేస్తాం. బెంగళూరులోని 10 మంది ఫొటోగ్రాఫర్లతో కలిసి ఇప్పటికే ఫొటోలు తీసి చరిత్ర వెబ్‌లో ఉంచడం జరుగుతోంది.
లేపాక్షి ఆలయంలో అసంపూర్తీగా ఉన్న పార్వతి, పరమేశ్వరుల కల్యాణ మండపానికి ఆనుకుని లతా మండపంపై రాజేంద్ర తీసిన డాక్యుమెంటరీ ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా లతా మండపంపై ఉన్న 36 స్థంభాలపై సుమారు 144 డిజైన్లను ఈ యువకుడు ‘కుతాస్థ’ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. 500ఏళ్ల క్రితమే చెక్కిన ఈ శిల్పాలను ప్రస్తుతం ధర్మవరం, పోచంపల్లి, గద్వాల్‌, కాంచిపురం మొదలైన చీరలపై వస్తున్నాయంటే అప్పట్లోనే శిల్పులు ఎంత నైపుణ్యంగా వీటిని చెక్కారో అర్థం చేసుకోవచ్చని అంటాడు ఈ యువకుడు. ఇలాంటి ఎన్నో అంశాలతో కూడిన వాటిని వెబ్‌లో ఉంచి విశ్వ వ్యాప్తంగా లేపాక్షి చరిత్ర తెలియజేయాలనే ఉద్దేశ్యంతో కుతాస్థ ప్రాజెక్ట్‌ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పుస్తకాల రూపంలో లేపాక్షి చరిత్ర ఉన్నా కొన్ని భాషలకే పరిమితం అయింది. అయితే వినోద్‌ రాజేంద్ర సంకల్పించిన దానికి ఆదరణ తోడైతే ఈ చరిత్ర విశ్వవ్యాప్తంగా మరింత వెలుగొందుతుంది. ఫేస్‌బుక్‌లో అనంతపురంజిల్లా హిందూపురం గ్రూప్‌ను క్రియేట్‌ చేసి తెలుగు, ఇంగ్లీష్‌లో లేపాక్షి చరిత్రకు సంబంధించి 250 ఫొటోలతోపాటు క్షుణ్ణంగా దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ గ్రూప్‌లో ఉంచడం జరిగింది.
లేపాక్షి ఆలయంలో ఒక రాయిపై ‘శ్రీకాళహస్తి’ పుణ్యక్షేత్రం కథను చెక్కినారు. శ్రీ అనగా ‘సాలీడు పురుగు’, కాళ అనగా ‘పాము’, హస్తి అనగా ‘ఏనుగు’ ఇలా మూడింటిని శివలింగంతో పాటు ఒక దగ్గర చెక్కారు. ఈ కథ ఆలయ నిర్మాణ సమయంలో చెక్కబడింది. కాబట్టి ‘శ్రీకాళహస్తి’ పుణ్యక్షేత్రం లేపాక్షి ఆలయం మునుపే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు.
లేపాక్షి ఆలయ మొదటి ప్రాకారంలో ఒక రాయిపై భారీ వినాయకుడి విగ్రహం దర్శనమిస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం మొదటి పూజ అందుకోవాల్సిన వినాయకుడి విగ్రహాన్నే తొలుత ఈ దేవాలయంలో చెక్కినారు. అనంతరం మిగిలినవన్నీ నిర్మించతలపెట్టారు.
లేపాక్షి ఆలయంలో నాగలింగం వెనుకభాగంలో అసంతపూర్తి పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మండపం దర్శనమిస్తుంది. ఈ మండపంలో ఎనిమిది దిక్కులలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని, కల్యాణానికి విచ్చేసిన దేవతలను, అతిథులను శిల్పకళా చాతుర్యంతో అద్భుతంగా చెక్కా రు.
కుతాస్థ అంటే..
జ్ఞానం. ప్రపంచంలో అన్నింటికీ మించిన జ్ఞానం. శివుడి మూడో కన్ను అని అర్థం వస్తుంది. మ నుషులకు మించి ఉండే జ్ఞానాన్ని కుతాస్థ అంటారు. దేవాలయాల్లోని శిల్పాలు, కళాకృతుల్లో నిక్షిప్తమైన చరిత్రను భవిష్యత్‌ తరాలకు జ్ఞానం పంచాలనే ఉద్ధేశ్యంతోనే కుతాస్థ ప్రాజెక్టును చేపట్టినట్లు వినోద్‌ రాజేంద్ర చెప్పాడు.