Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రవాసులకు బాండ్లు

తెరపైకి ప్రభుత్వ ప్రతిపాదన
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే
గతంలో సానుకూల ఫలితాలు
3,500 కోట్ల డాలర్లు సమీకరించొచ్చు
ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజురోజుకి పడిపోతోంది. మంగళవారం 24 పైసలు నష్టపోయి రూ.72.69 దగ్గర ముగిసింది. దీంతో ఈ సంవత్సరం డాలర్‌తో రూపాయి ఇప్పటి వరకు 13 శాతం నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం రేటును రూ.65 నుంచి రూ.68 మధ్య నిలబెట్టేందుకు ఆర్‌బిఐ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇందుకోసం ఫారెక్స్‌ నిల్వల నుంచి 2,500 కోట్ల డాలర్ల ఖర్చు చేసినా ఏ మాత్రం ప్రయోజనం కనిపించలేదు. మరో వైపు డాలర్‌తో రూపాయి మారకం రేటు త్వరలోనే రూ.75కు చేరుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో రూపాయి పతనానికి చెక్‌ పెట్టేందుకు మళ్లీ ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) తలుపు తట్టాలనే ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకోసం ఇప్పటికే ఆర్‌బిఐతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అవసరాన్ని బట్టి ఈసారి ఎన్‌ఆర్‌ఐ బాండ్ల ద్వారా 3,000 కోట్ల నుంచి 3,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.16 లక్షల కోట్ల నుంచి రూ.2.52 లక్షల కోట్లు) వరకు సమీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎన్‌ఆర్‌ఐ బాండ్స్‌ అంటే ?
విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు మాత్రమే ఈ బాండ్స్‌ లేదా డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. వీరు డాలర్ల రూపంలోనే ఈ బాండ్స్‌లో మదుపు చేయాలి. కాలపరిమితి తర్వాత చెల్లింపులు మాత్రం భారత కరెన్సీలో చేస్తారు. వీటి కాలపరిమితి మూడు నుంచి ఐదేళ్లు. ఈ బాండ్లపై ఆయా దేశాల్లో అమలులో ఉన్న వడ్డీ రేట్ల కంటే, కొద్దిగా ఎక్కువ వడ్డీ రేటు చెల్లిస్తారు.
ప్రత్యామ్నాయాలు లేవా ?
ఈ నిధులతో తాత్కాలికంగా ఫారెక్స్‌ నిల్వలు పెరిగినా, చెల్లింపుల సమయంలో వడ్డీతో సహా కలిపి రూపాయిల్లో చెల్లించాలి. ఎన్‌ఆర్‌ఐ లు ఆ మొత్తాన్ని డాలర్లలోకి మార్చుకుని మరీ వారుంటున్న దేశానికి తీసుకుపోతారు. అంటే చెల్లింపుల సమయంలో మళ్లీ ఫారెక్స్‌ మార్కెట్‌పై ఒత్తిడి తప్పదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా అత్యవసరం కాని దిగుమతులను కట్టడి చేయడం ద్వారా ఫారెక్స్‌ నిల్వలు కాపాడుకోవటం ఒక మార్గం, ప్రత్యేక ప్రోత్సాహకాల ద్వారా డాలర్లు తెచ్చే ఎగుమతులు పెంచుకోవడం. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించడం ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
  • పోఖ్రాన్‌ అణు పరీక్షల తర్వాత తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తొలిసారిగా ఎన్‌ఆర్‌ఐలను ఆశ్రయించింది. ఇందుకోసం వాజ్‌పేయి ప్రభుత్వం 1998లో రీసర్జంట్‌ ఇండియా బాండ్స్‌ పేరుతో ఎన్‌ఆర్‌ఐల నుంచి 480 కోట్ల డాలర్లు సమీకరించింది.
  • మళ్లీ 2001లో ఇండియా మిల్లీనియం డిపాజిట్‌ (ఐఎండి) పేరుతో మరో 550 కోట్ల డాలర్లు సమీకరించారు.
  • అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ చర్యలతో 2013లోనూ రూపాయి మారకం రూ.68.84కు క్షీణించింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ ఎన్‌ఆర్‌ఐల నుంచి ‘ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ డిపాజిట్స్‌ (ఎఫ్‌సిఎన్‌ఆర్‌-బి) పేరుతో 3,400 కోట్ల డాలర్లు సమీకరించి గండం నుంచి గట్టెక్కింది.
 
ఇప్పటికే మూడు సార్లు : ఎన్‌ఆర్‌ఐ బాండ్లు లేదా డిపాజిట్ల ద్వారా మన దేశం ఫారెక్స్‌ నిల్వలు పెంచుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే 1998, 2001, 2013లో ఇలా మూడు సార్లు ఈ బాండ్లు, డిపాజిట్లు జారీ చేశారు.
ఎన్‌ఆర్‌ఐ బాండ్లు జారీ చేసిన ప్రతిసారి రూపాయి ఆటుపోట్లకు తెరపడింది. పీపా చమురు ధర ఇప్పటికే 75 డాలర్లు దాటిపోయింది. ఈ నేపథ్యంలో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం మళ్లీ ఎన్‌ఆర్‌ఐ బాండ్లు జారీ చేస్తుందని భావిస్తున్నాం.
– ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, ప్రధాన ఆర్థికవేత్త, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌