Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్నే సవాల్ చేస్తున్నాయి. లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో… ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ బిక్కచచ్చిపోయి, బేల చూపులు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. పార్టీకి కొత్త గ్లామర్ తీసుకురావాల్సిన ఆవశ్యకతను కొంతమంది కాంగ్రెస్ పెద్దలు అధినేత్రి సోనియాకు వివరించారు. ఈ క్రమంలో ప్రత్యక్ష పార్టీ కార్యకలాపాలకు ఇంతకాలం దూరంగా ఉన్న ప్రియాంకగాంధీని… ఇకపై పార్టీలో కీలక పాత్ర పోషించేలా చేయాలనేది కొంతమంది వ్యూహం. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయిందనేది సమాచారం.

పార్టీని నడిపించడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారని… ప్రజలను ఆకట్టుకోవడంలో రాహుల్ ఛరిష్మా పనిచేయలేదనే వ్యాఖ్యలు సర్వత్ర వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ ను లూప్ లైన్లో పెట్టి, ప్రియాంకను మెయిన్ ట్రాక్ ఎక్కిస్తారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. అయితే, ఇవన్నీ వదంతులేనని… పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రియాంక పోటీ కాదని పార్టీ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. రాహుల్ నాయకత్వంలోనే ప్రియాంక పనిచేస్తుందని చెబుతున్నారు.

త్వరలోనే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల అనంతరం ప్రియాంకగాంధీకి పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా ఉత్తరప్రదేశ్ ఇన్ ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం.