Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ వరద బాధిత కేరళకు సహాయక సామగ్రిని తీసుకురానుంది. ఎమిరేట్స్‌ విమానంలో 175టన్నుల సహాయ సామగ్రిని కేరళకు పంపిస్తున్నారు. కేరళ వాసులకు యూఏఈ అండగా ఉంటుందని, ఎమిరేట్స్‌ స్కై కార్గో విమానం ద్వారా 175టన్నుల సహాయక సామగ్రిని తీసుకొస్తున్నామని విమానయాన సంస్థ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. యూఏఈలోని ఎంతో మంది వ్యాపారవేత్తలు, ప్రజలు, సంస్థలు అందించిన సాయాన్ని విమానాల ద్వారా తిరువనంతపురానికి తరలిస్తున్నట్లు తెలిపారు. సహాయక సామగ్రిలో బోట్లు, రగ్గులు, పాడవ్వని ఆహార పదార్థాలు, తదితర అత్యవసర వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని కేరళలోని స్థానిక సంస్థలకు ఇచ్చి పంపిణీ చేయించనున్నారు.

కేరళలో గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వచ్చిన వరదలతో రాష్ట్రం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దాదాపు పది లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకోవాల్సి వస్తోంది. గత మూడు, నాలుగు రోజులుగా వర్షం, వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పునరావాస శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ వర్షాకాలంలో కేరళలో దాదాపు 400 మందికిపైగా మరణించారు. కేరళకు కేంద్రం రూ.600కోట్ల సహాయ నిధిని ప్రకటించింది. యూఏఈలో పనిచేస్తున్న విదేశీయుల్లో దాదాపు 80శాతం మంది కేరళ వాసులే ఉన్నందున వారు కేరళకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.