Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మలై కోఫ్తా 

కావల్సినవి: పనీర్‌ తరుగు – కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – రెండు, గరంమసాలా – అరచెంచా, జీడిపప్పు, బాదం పలుకులు – టేబుల్‌స్పూను చొప్పున, మొక్కజొన్నపిండి – రెండు టేబుల్‌స్పూన్లు, నూనె – వేయించేందుకు సరిపడా, ఉప్పు – తగినంత, కారం -కొద్దిగా.
ప్యూరీ కోసం: నూనె – టేబుల్‌స్పూను, ఉల్లిపాయ – ఒకటి, టొమాటోలు – రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద – చెంచా, పసుపు – అరచెంచా, కారం – రెండు చెంచాలు, ధనియాలపొడి – ఒకటిన్నర చెంచా.
కోఫ్తా గ్రేవీ కోసం: వెన్న – రెండు చెంచాలు, బిర్యానీ ఆకు – ఒకటి, యాలకులు – రెండు, లవంగాలు – మూడు, దాల్చినచెక్క – చిన్న ముక్క, జీడిపప్పు ముద్ద – పావుకప్పు, గరంమసాలా – అరచెంచా, ఉప్పు – తగినంత, నీళ్లు – పావుకప్పు, క్రీం – పావుకప్పు. కసూరీమేథీ – టేబుల్‌స్పూను.
తయారీ: ముందుగా కోఫ్తాలు తయారు చేసుకోవాలి. ఓ గిన్నెలో పనీర్‌ తురుమూ, ఉడికించిన బంగాళాదుంప ముద్ద వేసుకుని బాగా కలపాలి. తరవాత ఉప్పూ, గరంమసాలా, జీడిపప్పు, బాదం పలుకులు, కారం వేసి అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని మొక్కజొన్న పిండిలో అద్దుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని ఓ పళ్లెంలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యూరీ తయారుచేసుకోవాలి. వెడల్పాటి బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేయాలి. అందులో ఉల్లిపాయముక్కలు వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి ముద్ద వేయాలి. అది వేగాక టొమాటో ముక్కలు వేసి మూత పెట్టేయాలి. పదిహేను నిమిషాల తరవాత పసుపు, కారం, ధనియాలపొడీ, తగినంత ఉప్పు వేసి కలిపి దింపేయాలి. దీని వేడి పూర్తిగా చల్లారాక మిక్సీజారులో తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకుని తీసుకోవాలి. కోఫ్తా కర్రీ కోసం బాణలిలో వెన్న వేసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక బిర్యానీ ఆకు, యాలకులూ, లవంగాలూ, దాల్చిన చెక్కా వేయాలి. అవి వేగాక ముందుగా చేసి పెట్టుకున్న టొమాటో ముద్దను వేయాలి. రెండుమూడు నిమిషాలయ్యాక జీడిపప్పుముద్ద వేసి మూత పెట్టాలి. పది నిమిషాల తరవాత గరంమసాలా, కొద్దిగా ఉప్పూ, నీళ్లూ పోసి బాగా కలపాలి. కాసేపటికి ఇది గ్రేవీలా తయారవుతుంది. అప్పుడు క్రీం, కసూరీ మేథీ వేసి ఓసారి కలిపి దింపేయాలి. ఈ గ్రేవీలో ముందుగా చేసుకున్న కోఫ్తాలను వేసి కలిపితే సరిపోతుంది.