Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వాతావరణ మార్పులపై గళమెత్తిన 16 ఏళ్ల స్వీడిష్‌ యువకెరటం గ్రెటా థన్‌బెర్గ్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూరోపియన్ పార్లమెంట్ పర్యావరణ కమిటీ ఆఖరి సమావేశ సభలో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. పర్యాపరణ పరిరక్షణకోసం శరవేగంగా నడుం బిగించాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. అటవీ నిర్మూలన, జంతువుల నాశనం, మహాసముద్రాల ఆమ్లీకరణ లాంటి వాటితో మనషి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పిల్లలు, మనవలు భవిష్యత్తుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గ్రెటా కన్నీంటి పర్యంత మయ్యారు.

మన ఇల్లు కూలిపోతోంది..సమయం లేదు..అమూల్యమైన సమయం వృధా అయిపోతోంది.. ఇకనైనా ప్రతీ వ్యక్తి స్పందించాలంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. బ్రెగ్జిట్‌పై మూడు అత్యవసర సదస్సులు నిర్వహించిన బ్రిటన్‌ పర్యావరణానికి పొంచి వున్న ముప్పుపై మాత్రం ఎలాంటి ‍స్పందన చూపించ లేదని విమర్శించారు. రాజకీయ నాయకులు పర్యావరణం తప్ప అన్నీ మాట్లాడతారు. వారికి మాతో (పర్యావరణంకోసం ఉద్యమిస్తున్న బాలలు) మాట్లాటడం ఇష్టం ఉండదు..నో ప్రాబ్లమ్‌..మాకు కూడా వారితో మాట్లాడాలని లేదు. ఓటు హక్కులేని మా మాటలు విశ్వసించకండి..కానీ సైంటిస్టులు, సైన్సు చెపుతున్న మాటల్ని అయినా నమ్మండి. సమయం మించిపోతోంది. ఇకనైనా మేల్కోండి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి..లేదంటే అంతా శూన్యమే అంటూ నేతలకు చురకలంటించారు.

వాతావరణ మార్పుల పరిణామాలను నిర్లక్ష్యం చేయొద్దంటూ కోరారు. మీ ఇల్లు కాలిపోతోంటే..ఎంత ఆందోళన చెందుతారో అలాంటి ఆందోళన, భయం ఇపుడు పర్యావరణం పట్ల ప్రపంచ నేతలకు ఉండాలని కోరారు. అలాగే కేథడ్రాల్ నోట్రడామ్‌ చర్చి అగ్ని ప్ర​మాదంపై విచారం వ్యక్తం చేసిన ఆమె యుద్ధ ప్రాతిపదికన దాని పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. పర్యావరణ రక్షణకు కూడా “కేథడ్రాల్-థింకింగ్” ఇపుడు అవసరమని గ్రెటా పేర్కొన్నారు.

కాగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి గ్రెటా థన్‌బెర్గ్‌ నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో స్వీడిష్‌ పార్లమెంట్‌ ఎదుట జరిపిన సోలో నిరసనతో థన్‌బెర్గ్‌ ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులకు స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అంతేకాదు ఆమె స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలలో ఫ్రైడే ఫర్‌ ఫ్యూచర్‌ పేరుతో ప్రతీ శుక్రవారం పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున యువత ఉద్యమిస్తోంది.