Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఉదయం నిద్రలేవగానే హాయిగొలిపే దృశ్యాలను చూడాలి, మనసును ఆహ్లాదపరిచే సంగీతం వినాలి, మంచి మాటలు వింటూ సంస్కారవంతమైన పరిసరాలలో గడపాలి. అప్పుడే మనిషి మానసికంగా ఉల్లాసంగా రోజును గడుపుతాడు. ఆ ప్రభావంతో శారీరంగా ఆరోగ్యంగా ఉంటాడు. అలా కాకుండా ఉదయం నిద్రలేవగానే ఒళ్లు గగుర్పొడిచే భయానక సంఘటనలను చూస్తే ఆ రోజంతా మనసు భావోద్వేగాలకు లోనవుతుంటుంది.

ఆ ప్రభావం రక్తప్రసరణ మీద చూపుతుంది. రోజూ ఇవే చేస్తుంటే దేహం, మనసు రెండూ అనారోగ్యం పాలవుతాయి. కొన్నేళ్లపాటు కొనసాగితే దేహం దీర్ఘకాలిక అనారోగ్యాలకు నిలయమవుతుంది. క్షణికావేశం, చిన్న విషయాలకే ఆవేశ పడడం, స్థితప్రజ్ఞత లోపించడం, చిన్న వివాదానికి చంపుకోవడం వంటివి ఎక్కువవుతాయి. ఈ లక్షణాలు ఆ మనిషిలో స్వతహాగా లేకపోయినా కూడా పైన చెప్పిన జీవన స్థితిలో అవన్నీ వచ్చి చేరుతాయి.

మనుషుల్లో ప్రకోపాలు, ఉద్రేకాలకు నిత్యం మనం ప్రసారమాధ్యమాలలో చూస్తున్న కథనాలు కూడా కారణమే. సంచలనాల కోసం ఒక సంఘటనను భయానకంగా కథనం అల్లడం వల్ల వాటిని తయారు చేసే వారి ఆరోగ్యం, చూసే వారి ఆరోగ్యం, మానసిక ప్రవర్తనలు ప్రభావితమవుతుంటాయి. ఓం శాంతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రాజస్థాన్‌ రాష్ట్రం, సిరోహి జిల్లా అబూ రోడ్‌లోని శాంతివనంలో నిర్వహించిన జాతీయ స్థాయి మీడియా సమావేశంలో ఇదే విషయాలను చర్చించారు.

సమాజం మీద సానుకూల ప్రభావాన్ని చూపించే వార్తాకథనాలను విస్తృతంగా ప్రచురిస్తూ, భయోత్పాలకు లోను చేసే వార్తలను క్లుప్తంగా ప్రచురించడం ఒక మధ్యేమార్గం. ఈ మార్గం… విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఒక సోపానం అవుతుంది. అందుకేనేమో బుద్ధుడు కూడా సమ్యక్‌ వాక్కు అని మంచి మాటకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు.