Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కొలరాడో, యూఎస్ఏ: అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన ‘హారికేన్ ఫ్లోరెన్స్’ తీవ్ర రూపం దాల్చించి. కేటగిరి 5 తీవ్రత గల హారికేన్‌గా మారిందని, సమీప ప్రాంతాలపై అతి తీవ్రమైన ప్రభావం చూపనుందని అమెరికా జాతీయ వాతావరణ సేవల సంస్థ ప్రకటించింది. ఈ భయంకరమైన హారికేన్ తీరం దాటుతున్న సమయంలో గంటకు 157 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయని, అపారమైన నష్టం వాటిల్లనుందని అధికారులు హెచ్చరించారు. గురువారం నుంచి తూర్పు తీరంపై తీవ్రమైన ప్రభావం చూపనుందని, ఈదురు గాలులతోపాటు కుండపోత వర్షం కురవనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా, మేరిల్యాండ్ రాష్ట్ర తీర ప్రాంతాల్లోని 20 మిలియన్ల మందిపై ఈ హారికేన్ తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అనేకమంది స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అవసరమైన ప్రదేశాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోవాలని ప్రభావిత ప్రజలకు అధికారులు సూచించారు. దీంతో మాల్స్ అన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రజలు వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. పలు మాల్స్‌లోని నిత్యవసర వస్తువులు ఖాళీ అయ్యాయి. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇదిలావుండగా భయంకరమైన ఈ హారికేన్ కారణంగా 30 బిలియన్ల ఆస్తి నష్టం జరగవచ్చునని వాతావరణ శాఖ నిపుణులు, అధికారులు అంచనా వేస్తున్నారు.