Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఏప్రిల్‌ 15న ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. సోమవారం బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్వహించిన సమావేశానికి సీఓఏ సభ్యులతో పాటు బోర్డు తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరిలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచకప్‌ జట్టును ఈ నెల 15న ప్రకటించే విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యుల గల భారత జట్టును ప్రకటించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ప్రపంచకప్‌ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐకి ఏప్రిల్‌ 23 వరకు అవకాశం ఉన్నప్పటికీ.. జట్టు ఎంపిక సులభతరం చేసేందుకు ముందుగానే ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికీ నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌, నాలుగో పేస్‌ బౌలర్‌ స్థానాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా ఆ మిగిలిన ఆటగాళ్లను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. భారత జట్టు కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని సంప్రదించిన తర్వాతే తుది జట్టు ప్రకటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలోనే ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల (రెండు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు, ఎలిమినేటర్‌ మ్యాచ్‌) వేదికలుగా హైదరాబాద్, చెన్నైలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. అయితే రాయుడు తాజా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించలేదు. మరోవైపు పంత్‌ చెలరేగుతున్నా.. మ్యాచ్‌ను ముగించే సామర్థ్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు విజయ్‌శంకర్‌ కూడా తాను పోటీలో ఉన్నాననే విధంగా ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక మే 30 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే.