Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వానలతోపాటే వ్యాధులూ విజృంభిస్తాయి. నిల్వ నీరు, మురుగు, దోమలు, ఈగలు… వీటి కారణంగా పెద్దల కంటే పిల్లలే ఈ కాలంలో తేలికగా వ్యాధుల బారిన పడతారు. కాబట్టి వానల్లో పిల్లలను ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా కాపాడుకోవాలి!
వానాకాలం వ్యాధులు
టైఫాయిడ్‌, విరేచనాలు, వాంతులు, జలుబు, శ్వాససంబంధ సమస్యలు, డయేరియా… ఇలా చెప్పుకుంటూపోతే వానాకాలం పిల్లలను వేధించే వ్యాధులకు అంతే ఉండదు. అయితే వర్షాకాలంతోపాటు వచ్చే ప్రతి వ్యాధినీ పిల్లలు భరించవలసిన అవసరం లేదు. చిన్నపాటి జాగ్రత్తలతో ఈ వ్యాధుల నుంచి రక్షణ పొందే వీలుంది. ఆహారపానీయాల్లో శుభ్రత, శరీర, పరిసరాల శుభ్రత పాటించగలిగితే పిల్లల జోలికి ఈ వ్యాధులేవీ రావు. ఇందుకోసం…
ఆహారం తినే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.
కాచి వడగట్టిన నీటినే పిల్లలకు ఇవ్వాలి.
పదార్థాల మీద మూతలు ఉంచాలి.
బయట దొరికే పండ్ల రసాలు, తినుబండారాలకు పిల్లలను దూరంగా ఉంచాలి.

డెంగ్యూ జ్వరం

వానాకాలంలో విపరీతంగా విజృంభించే ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించడం ఎంతో కీలకం. సాధారణ జ్వరంలాగే డెంగ్యూ కూడా మొదలవుతుంది కాబట్టి పిల్లలకొచ్చే ఎలాంటి జ్వరాన్నీ అశ్రద్ధ చేయకూడదు. ఎముకలు, కీళ్లు, కళ్లు నొప్పిగా ఉండి, ముఖం మీద దద్దుర్లు మొదలై ఎర్రబారితే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
పసికందులకు పరిశుభ్రతే ప్రధానం
వానాకాలం వాతావరణంలో తేమ పెరిగి చమట పట్టే అవకాశం ఉంది. కాబట్టి పసికందులకు వాతావరణం కొద్దిగా వేడిగా ఉన్న సమయంలో స్నానం చేయిస్తూ ఉండాలి.
వాతావరణం చల్లగా ఉంటే వేడి నీటిలో ముంచి పిండిన గుడ్డతో ఒళ్లంతా తుడవాలి.
చర్మం ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి.
శరీరం మొత్తం కప్పి ఉంచే దుస్తులు వేయాలి.
దోమ తెరలు, లేపనాలు వాడాలి తప్ప కాయిల్స్‌ వాడకూడదు.
డైపర్లను తరచుగా మారుస్తూ ఉండాలి.