Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రవై రెండేళ్ల కల ఫలించి పాక్‌ ఇరవై రెండో ప్రధానిగా పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ పట్టాభిషిక్తులైన వేళ ఇది. జులై 25న జాతీయ అసెంబ్లీతోపాటు నాలుగు కీలక పరగణాలకూ జరిగిన ఎన్నికల్లో- ప్రధాన రాజకీయ శక్తులైన పీఎమ్‌ఎల్‌ (ఎన్‌), పీపీపీలను వరసగా రెండు మూడు స్థానాల్లోకి నెట్టి పీటీఐ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. గత రెండు పర్యాయాలకు భిన్నంగా ఈసారి జరిగినవి జనరల్‌ (సాధారణ) ఎన్నికలు కావని, జనరల్స్‌ (సైనికాధికారుల) ఎలెక్షన్లని లోకం కోడై కూయడం తెలిసిందే. 2013 దరిమిలా మన్ను తిన్న పాములా ఉన్న భుట్టోల పార్టీ పీపీపీని పక్కనపెట్టి, నవాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని పీఎమ్‌ఎల్‌ (ఎన్‌)కు పునరధికారం దక్కకుండా చూడటానికి తెరవెనక సైన్యం ఆడిన కపట నాటక విన్యాసం అచ్చెరువు గొలిపేదే. సైన్యం అజెండాకు అనుగుణంగా న్యాయపాలిక సైతం వ్యవహరించడంతో- నవాజ్‌ షరీఫ్‌ పార్టీపై సైన్యం అక్షరాలా ఉక్కుపాదం మోపింది. 2010 నాటి రాజ్యాంగ సవరణల అనంతరం ప్రజాప్రభుత్వాల్ని ప్రత్యక్షంగా కబళించే దారులు మూసుకుపోవడంతో, పరోక్షంగా ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేసి- ఎన్నికల తోలుబొమ్మలాటను సైన్యం రక్తి కట్టించింది. పాకిస్థాన్‌ నేడు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక రాజకీయ, అంతర్జాతీయ సంక్షోభాలన్నింటికీ చిరకాలం దేశాన్నేలిన ప్రధాన పార్టీలనే బాధ్యుల్ని చేసి, ఈసారి పీటీఐకి వెన్నుదన్నుగా నిలవడం ద్వారా సరికొత్త రాజకీయ చరిత్రకు సైన్యం పురుడు పోసింది. జాతీయ అసెంబ్లీ సీట్లు మొత్తం 342 అయినా, 272కే ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించి, తక్కిన 70 స్థానాలను పార్టీల బలాబలాల ఆధారంగా దామాషా పద్ధతిన కేటాయించడం ఆనవాయితీ. సాధారణ మెజారిటీకి 14 సీట్లు తరుగుపడిన దశలో ఏడు చిన్న పార్టీల మద్దతుతో ప్రధానమంత్రిత్వాన్ని సాధించిన ఇమ్రాన్‌ ఖాన్‌ ముందున్నదంతా ముళ్లదారి. ఉదారవాదమో ఛాందసవాదమో కాదు, సరైన పాలన లేకపోవడమే పాకిస్థాన్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని తీర్మానించిన ఇమ్రాన్‌ ఖాన్‌- ‘నయా పాకిస్థాన్‌’ను ఎలా ఆవిష్కరిస్తారో చూడాలి!
‘నా వెనక ఏ నియంతా లేడు… పార్లమెంటులో నేను స్వశక్తితో నిలబడ్డాను’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించినా- వాస్తవం వేరు. 1992లో పాకిస్థాన్‌కు ప్రపంచ క్రికెట్‌ కప్‌ను సాధించిపెట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌ అవినీతిపై ఎలుగెత్తుతూ 1996 ఏప్రిల్‌లో పీటీఐ పార్టీని స్థాపించారు. 2001 ఎన్నికల్లో గెలిచి తానొక్కడే జాతీయ అసెంబ్లీలో కాలిడిన ఇమ్రాన్‌ 2008 ఎన్నికల్ని బహిష్కరించారు. 2013 ఎన్నికల్లో అఫ్గాన్‌ సరిహద్దు పరగణా ఖైబర్‌ ఫక్తూన్‌ ఖ్వాలో అధికారం చేపట్టిన ఇమ్రాన్‌ పార్టీ- నవాజ్‌ షరీఫ్‌ పార్టీ పైనా, ప్రభుత్వం పైనా అయిదేళ్లుగా పోరుబాటలో కదం తొక్కింది. సైనిక నియంతృత్వాన్ని తిరస్కరించి, బ్యాలెట్‌ పవిత్రతను కాపాడాలంటూ నవాజ్‌ షరీఫ్‌ జైలునుంచే పిలుపిచ్చినా, పరిస్థితులు ఇమ్రాన్‌కు అనుకూలించేలా సైన్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా పావులు కదిపి- అంతిమ ఫలితాన్ని తనకు నచ్చిన విధంగా అనుశాసించింది. ఇరవై కోట్లకు పైబడిన జనాభాగల పాకిస్థాన్‌లో మొత్తం పదికోట్ల 60 లక్షల నమోదిత ఓటర్లలో ఎకాయెకి మూడు కోట్లమంది కొత్తగా ఓటుహక్కు పొందినవారే. విదేశ మారక ద్రవ్య నిల్వలు కొడిగట్టి, కరెంటు ఖాతాలోటు దారుణంగా పెరిగి, ఆర్థిక మందగమనంలో దేశం కూరుకుపోయిన తరుణంలో నిరుద్యోగిత రేటుకు రెక్కలు మొలవడం నవతరాన్ని బెంబేలెత్తించేదే. ఏటా 20 లక్షల ఉద్యోగాలు, అయిదేళ్ల కాలంలో తలసరి ఆదాయంలో 50 శాతం పెరుగుదల, ఇళ్లు లేనివారికి ఏటా రెండు లక్షల గృహాలు, అయిదేళ్లలో పూర్తిస్థాయి అక్షరాస్యత, పేదింటి ఆడపిల్లలకు మెట్రిక్‌ దాకా ఉచితవిద్య వంటి హామీలు ఇచ్చిన ఇమ్రాన్‌కు మొట్టమొదటి సవాలు- కుంగిన ఆర్థిక వ్యవస్థ నుంచే ఎదురవుతోంది. అవినీతి మోతుబరులు దోచి, దాచిన సొమ్మును కక్కిస్తానన్న ‘హీరో’చిత వాగ్దానాల అమలూ ఇమ్రాన్‌కు కత్తిమీద సాము కానుంది!
దాయాది దేశమైన పాకిస్థాన్‌ సౌభాగ్య ప్రగతిశీల రాజ్యంగా రాణించాలనే భారత్‌ ఎప్పుడూ అభిలషిస్తోంది. హింస ఉగ్రవాదాల పొడపడని సుభద్ర, సుస్థిర, సురక్షిత, అభివృద్ధి చెందిన దక్షిణాసియా నిర్మాణానికి పాకిస్థాన్‌ కొత్త ప్రభుత్వం పాటుపడాలని మోదీ ప్రభుత్వమూ శుభాకాంక్షలు తెలిపింది. భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి సంసిద్ధత చాటుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌- ఇండియా ఒక అడుగు కదిపితే తాము రెండడుగులు వేస్తామని ప్రకటించారు. కీలకమైన కశ్మీర్‌ అంశం సహా అన్ని వివాదాల్నీ ఇరు దేశాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఇమ్రాన్‌ సూచన- భారత్‌ బాణీకి అనుగుణంగానే ఉంది. ఆక్రమిత కశ్మీరును ఉగ్రవాద తండాల నట్టిల్లుగా మార్చి సీమాంతర ఉగ్రవాదానికి కోరలు తొడుగుతున్న పాకిస్థాన్‌- ఆ వినాశకర పంథా నుంచి వైదొలగితే, ద్వైపాక్షిక చర్చలకు మేలుబాటలు పడతాయని భారత్‌ ప్రభుత్వం ఎంతోకాలంగా చెబుతోంది. ఉగ్రవాద విషవృక్షానికి నిధుల నీళ్ల సరఫరా నిలుపు చెయ్యనందుకు 37 దేశాల ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎస్‌) నిషేధిత జాబితాలోకెక్కిన పాకిస్థాన్‌, ఆర్థిక దిగ్బంధనానికి గురి అవుతోంది. విదేశ మారకద్రవ్య నిల్వలు అడుగంటిన పరిస్థితుల్లో ఐఎమ్‌ఎఫ్‌ ముందు మరోమారు మోకరిల్లాల్సిన దుస్థితి దాపురించింది. ఐఎమ్‌ఎఫ్‌ రుణ మొత్తాలు చైనా బాకీల పద్దుకు చెల్లుపోతాయంటూ అమెరికా మోకాలడ్డుతున్న కీలక సమయంలో- పాక్‌ నేతాగణంలో ప్రాప్తకాలజ్ఞత రహించాలి. ప్రచ్ఛన్న యుద్ధసాధనంగా నెత్తికెత్తుకొన్న ఉగ్రవాద పంథాను పూర్తిగా విడనాడి, నాగరిక పద్ధతిలో చర్చల ద్వారా వివాద పరిష్కారానికి కూడిరావాలి. ఇమ్రాన్‌ ప్రవచిస్తున్న ‘నయా పాకిస్థాన్‌’ అవతరణకు అదే సరైన పునాది కాగలుగుతుంది!