Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మా క్షిపణులొస్తున్నాయ్‌ కాచుకోండి అంటూ హుంకరించి సిరియాలో ఉద్రిక్తతలు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మర్నాటికే కాస్త స్వరం తగ్గించారు. సిరియాపై దాడులు త్వరలోనే జరగవచ్చు, అలాగని అతి త్వరలో అని అనుకోవాల్సిన పనిలేదు అంటూ ట్వీట్‌ చేశారు. ఇటీవల సిరియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు ఘౌటా ప్రాంతంలోని డౌమా పట్టణంలో సర్కార్‌ సేనలు జరిపిన రసాయన దాడిలో వంద మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా సిరియాపై సమరశంఖం మోగించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచింది. సిరియాపై ఎలా దాడులు జరపాలా అంటూ తమ ముందున్న మార్గాలను పరిశీలిస్తోంది. మరోవైపు అమెరికాకు మద్దతుగా బ్రిటన్‌ తన జలాంతర్గాముల్ని మోహరించింది. అమెరికా ఎన్ని రకాలుగా దాడులు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్న అంశంపై అంతర్జాతీయ విశ్లేషకులు రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు.

గగనతల దాడులు
సిరియాపై గగనతలం ద్వారా దాడులు చేయడం.ఇది అన్నింటికంటే సులభమైన ప్రక్రియ. 
గత ఏడాది సిరియాపై అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేసి ఒక ఎయిర్‌బేస్‌ను కూల్చేశాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో సిరియా ప్రభుత్వ అనుకూల ప్రాంతాలపై తోమహక్‌ క్షిపణి దాడులు జరిపే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు గత ఏడాది మాదిరిగా లేవు. అసద్‌ ప్రభుత్వం ఇటీవల కాలంలో బాగా బలపడింది. దేశంలో అన్ని ప్రాంతాలపై పట్టు సాధించింది. అమెరికా దాడుల్ని ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతూ ఎయిర్‌బేస్‌లను ఖాళీ చేయిస్తోంది. రష్యా అండదండలు కూడా సిరియాకి ఉండడంతో గగనతలం దాడులు వల్ల ఫలితం ఉంటుందో లేదోనన్న ఆలోచనలో అగ్రరాజ్యం ఉంది.

నిరంతర దాడులు
సిరియాలో అసద్‌ ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూరేలా నిరంతర దాడులకు పాల్పడడం. సిరియాలో అత్యంత ముఖ్యమైన సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు నాశనమయ్యేలా నిరంతర దాడులకు దిగడం.. ఇలా చేయడం వల్ల రష్యాతో సంఘర్షణ తీవ్రతరమవుతుంది. రెండు దేశాలు ముఖాముఖి పోరాటానికి తలపడాల్సి వస్తుంది.

పూర్తి స్థాయి యుద్ధం 
ఈ పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పితే ఇక పూర్తి స్థాయి యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే అమెరికాకు దాని మిత్రదేశాలైన  బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ యుద్ధంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. సిరియాకు మద్దతుగా రష్యా, ఇరాన్‌లు కదన రంగంలోకి దిగితే ఏదైనా జరగవచ్చునని, మూడో ప్రపంచ యుద్ధం రావచ్చుననే అంచనాలున్నాయి.

సిరియాకి రష్యా ఎందుకు మద్దతు ఇస్తోంది ?
సిరియాకి, రష్యాకి మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచే ఉన్నాయి. 1970వ దశకంలో అప్పటి సోవియెట్‌ యూనియన్‌ నాయకుడు లియోనిడ్‌ బ్రెజ్నావ్‌ కాలం నుంచే సిరియాకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆ దేశానికి ఆయుధాలు, ఇతర సహాయాలు అందిస్తూ వచ్చారు. 1991లో సోవియెట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమయ్యాక ఆ రెండు దేశాల మధ్య సంబ«ంధాలు తెగిపోయాయి. అయితే 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ ఎన్నికయ్యాక తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం సిరియాతో మళ్లీ సంబంధాలను పునరుద్ధరించాలని అనుకున్నారు. అదే సమయంలో బషర్‌ అల్‌ అసద్‌ సిరియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఇక  2011 సంవత్సరంలో అరబ్‌ దేశాల్లో ఉద్యమాల  (అరబ్‌ స్ప్రింగ్‌) ప్రేరణతో సిరియాలో కూడా అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది.

ఆ సమయంలో పుతిన్, అసద్‌తో చేతులు కలిపారు. కేవలం సిరియాకు మాత్రమే కాదు ఈజిప్టు, లిబియా, ఇరాక్‌ వంటి దేశాలకు ఆయుధ సరఫరా చేస్తూ వచ్చారు. సిరియాలో తమ ప్రయోజనాలను కాపాడుకోవాలంటే అసద్‌ ప్రభుత్వం మనుగడ సాగించాలి. అంతేకాదు ఐఎస్‌ వంటి ఉగ్రవాద సంస్థలు తమ దేశంలోకి చొరబడకుండా ఉండాలంటే సిరియాకు మద్దతు ఇవ్వాలని భావించారు. అందుకే 2015 సంవత్సరంలో అసద్‌ ప్రభుత్వానికి మద్దతుగా రష్యా తమ బలగాల్ని మోహరించింది. దాడులు చేయించింది. తూర్పు సిరియాలో ఐఎస్‌ తన పట్టు కోల్పోయేలా చేయడంలో రష్యా కీలకభూమిక పోషించింది.

ఐక్యరాజ్యసమితి అధ్యక్షతన సమావేశం
పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు నెలకొనడంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఉద్రిక్తతలు పెంచిపోషిస్తున్న అగ్రరాజ్యాలకు హెచ్చరికలు పంపింది. సిరియాలో శాంతి స్థాపన దిశగా అన్ని దేశాలు కృషి చేయాలని పేర్కొంది. సిరియా సంక్షోభం పరిష్కారానికి అన్ని పక్షాల అనుమతితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యూఎన్‌ ఎప్పట్నుంచో చెబుతూ వస్తోంది.