Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘విమానంలో పీడనం తగ్గినప్పుడు ఆక్సిజన్‌ మాస్క్‌ దానంతటదే కిందికి వస్తుంది. దానిని ఇలా ధరించండి. ఇతరులకు సహాయపడే ముందు మీరు ఆక్సిజన్‌ మాస్క్‌ ధరించండి’… గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్‌ బయలుదేరే ముందు ఎయిర్‌ హోస్టె్‌సలు ఎప్పట్లాగే సూచనలు చేశారు. ‘ఎప్పుడూ విన్నవే కదా!’ అని ప్రయాణికులూ అనుకున్నారు. 5.52 గంటలకు విమానం గాల్లోకి ఎగిరింది. ఐదంటే ఐదు నిమిషాల్లోనే ఆక్సిజన్‌ మాస్క్‌లు టకటకమంటూ కిందికి వచ్చేశాయి. విమానంలో హాహాకారాలు… గందరగోళం! మొత్తం 166 మంది ప్రయాణికులు ఉండగా… సుమారు 30 మందికి చెవులు, ముక్కుల్లోంచి రక్తం కారింది. మరికొందరు చెవులు, తల బద్దలయ్యేంతగా పోటు మొదలైంది.
దీనంతటికీ కారణం… విమానంలో ఒత్తిడి (ప్రెజర్‌)ని సమతుల్యంగా ఉంచే మీటను ఆన్‌ చేయకపోవడమే! ఈ సమయంలో విమానంలో ఈ సమయంలో సిబ్బంది సరిగా వ్యవహరించలేదని, మాస్క్‌లు ధరించాలని సూచించలేదని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. దాదాపు 23 నిమిషాల తర్వాత విమానాన్ని తిరిగి ముంబైలో దించారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చెవుల్లోంచి రక్తం కారడంతో తాత్కాలికంగా చెవుడు వచ్చిన ఐదుగురికి చికిత్స అందించి వెంటనే ఆస్పత్రి నుంచి ఇళ్లకు పంపించివేశారు. వారం పది రోజుల్లో వీరికి పూర్తి స్వస్థత చేకూరుతుందని, ఈలోపు వారు విమాన ప్రయాణాలు చేయవద్దని వైద్యులు తెలిపారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని అప్పటికప్పుడే విధుల నుంచి తప్పించారు. విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) దీనిపై విచారణ ప్రారంభించింది. ఈనెల 11న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌ వెళ్లిన ఎయిర్‌ ఇండియా విమానంలోనే అనేక వ్యవస్థలు విఫలమయ్యాయి. పెలైట్ల చాకచక్యం, ఏటీసీ సహకారంతో ప్రయాణికులకు ముప్పు తప్పింది. ఇప్పుడు… జెట్‌ ఎయిర్‌వేస్‌ ఘటన నేపథ్యంలో మొత్తం అన్ని విమానాల్లో రక్షణ వ్యవస్థలపై పరిశీలన జరిపి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ఆదేశించారు.
బ్లీడ్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తేనే..
క్యాబిన్‌లో పీడనం నిర్వహించేందుకు ప్రత్యేకంగా గాలిని (దీనినే బ్లీడ్‌ ఎయిర్‌ అంటారు) పంప్‌ చేస్తారు. విమానం ప్రయాణిస్తున్నప్పుడే… బయట ఉన్న అతిశీతల గాలిని టర్బైన్‌ ఇంజన్లు లోపలికి లాక్కుంటాయి. ఆ గాలిని 200 డిగ్రీల దాకా వేడి చేస్తాయి. తర్వాత ఒక పద్ధతి ప్రకారం గాలిని క్యాబిన్‌లోకి పంప్‌ చేస్తారు. ఇదంతా జరగాలంటే విమానం బయలుదేరే ముందే సిబ్బంది ‘బ్లీడ్‌ స్విచ్‌’ ఆన్‌ చేయాలి. జెట్‌ ఎయిర్‌ వేస్‌ సిబ్బంది అదే మరిచిపోయారు.
30 లక్షలు పరిహారం ఇవ్వాలి..
జెట్‌ ఎయివేస్‌ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రయాణ సమయంలో గాయపడితే పరిహారం ఇవ్వాలని చట్టం చెబుతోంది. నాకు ఆ సంస్థ రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలి. దీంతోపాటు ఎకానమీ క్లాస్‌ టికెట్‌తో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించేలా వంద అప్‌గ్రేడ్‌ వోచర్లు ఇవ్వాలి. కాక్‌పిట్‌ సిబ్బంది పీడనం నిర్వహణపై మీట నొక్కకుండా వదిలేసిన వీడియోను కూడా విడుదల చేస్తా! – ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రయాణికుల్లో ఒకరు.