Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఒక వైపు తమ వేతన బకాయిలు చెల్లించకపోతే విధులను హాజరుకామని తేల్చి చెప్పిన పైలట్లు తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు లీగల్‌ నోటీసులిచ్చారు. వేతన బకాయిలను ఈనెల 14 లోగా అందించాలని డిమాండ్‌ చేస్తూ, జెట్‌ ఎయిర్‌వేస్‌ నూతన యాజమాన్యానికి పైలట్ల సంఘం (నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌-నాగ్‌) లీగల్‌ నోటీస్‌ జారీ చేసింది. సంస్థ యాజమాన్యం బ్యాంకుల చేతికి వచ్చినా, పరిస్థితిలో మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేసిన నాగ్‌ సంస్థ సీఈవో వివేక్‌ దుబేకు ఈ నోటీసులు పంపించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతన బకాయిలు ఈ నెల 14 నాటికి జీతాలుచెల్లించాలని, అలాగే ఇకపై ప్రతినెలా 1వ తేదీ కల్లా వేతనాలు అందించాలని కోరుతూ నూతన యాజమాన్యానికి నాగ్‌ నోటీసులిచ్చింది.

మరోవైపు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ (ఐవోసీ) మరోసారి ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ వారంలో ఇది రెండవ సారి.

అలాగే జెట్‌ఎయిర్‌వేస్‌లోని వాటాలను విక్రయించేందుకు ఎస్‌బ్యాంకు బిడ్లను ఆహ్వానించింది. ఇప్పటివరకు ఈ వాటాలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ఆసక్తిని కనబర‍్చక పోవడంతో గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లోని సుమారు 75శాతం వాటాల కొనుగోలుకు బిడ్లను స్వీకరించే గడువును ఏప్రిల్‌12వ తేదీ శుక్రవారం వరకు పొడిగించామని ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ప్రకటించింది.

ఇది ఇలా వుంటే నెదర్ల్యాండ్స్ ఆమ్‌స్టర్‌డాంలోని చిపోల్‌ విమానాశ్రయంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాన్ని నిలిపిశారు. బకాయిలు చెల్లించని కారణంగానే ముంబైకు చెందిన జెట్‌ విమానాన్ని దాదాపు ఆరు గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిలిపివేశారు. ఈ ఘటనపై స్పందించిన జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణా కారణాల వల్ల జెట్‌ విమానం 9డబ్ల్యు 231 ఆలస్యంమైందని, ప్రయాణీకుల సౌకర్యార్థం సంబంధిత చర్యలు తీసుకున్నామంటూ వివరణ ఇచ్చింది.