Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ట్రంప్ వీసా నిబంధనలతో సమస్యలు ఓ వైపు, మరోవైపు పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు దిగ్గజ ఐటి సంస్థలన్నీ ఉద్యోగాల కోత బాట పట్టిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంలో తమ సంస్థల ప్రతిష్ట దెబ్బతినకుండా ఐటి కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగాల కోతలు ఉంటాయని ఐటి నిపుణులు భయాందోళనలో ఉన్నారు. ప్రముఖ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ అలాంటిదేమి లేదని అంటూనే చావు వార్తని చల్లగా వివరించింది. తాము ఉద్యోగులను తొలగించడం లేదని తెలిపింది. కానీ వేతనాలను మాత్రం ఇప్పట్లో పెంచబోమని, పెర్ఫామెన్స్ ఆధారంగా కొందరి ఉద్యోగులను మాత్రం తొలగిస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.

వేతనాల పెంపుని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. తాము ఉద్యోగాల కోత విధించడం లేదని ఆయన ఉద్యోగుల్లో నెలకొన్న అనుమానాల్ని నెరవేర్చారు. కానీ గత కొంతకాలంగా మంచి పనితీరుని కనబర్చని ఉద్యోగులు మాత్రం వైదొలగాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. 8 ఏళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల వేతన పెంపు అంశాన్ని జులై నుంచి సమీక్షిస్తామని ఆయన అన్నారు. ఇన్ఫోసిస్ తోపాటు టెక్ మహీంద్రా కూడా వేతన పెంపు అంశాల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సీనియర్ ఉద్యోగుల వేతన పెంపుని ఆలస్యం చేస్తే వారు ఇతర ఉద్యోగాలు చూసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అనలిస్ట్ లు చెబుతున్నారు. ఈ అంశం ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నదని అంటున్నారు. ఇటీవల ఐటి ఉద్యోగులు లేఆప్స్ తో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఐటి కంపెనీలన్నీ తమ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నాయి.