Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పరీక్షల సమయంలో పిల్లల మనసు 24 గంటలూ చదువు మీదే లగ్నమై ఉండాలంటారు కొంతమంది తల్లిదండ్రులు. నిజానికి, ఇలా చదవడం వల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే, చదువుకు సంబంధించి ఏ రెండు సీరియస్‌ విషయాల మధ్యనైనా ఎంతో కొంత విరామం చాలా అవసరం. అలాగైతేనే చదివిన విషయాలు బుర్రలో రిజిస్టర్‌ అవుతాయి. విరామం దొరకాలంటే… చదువుకు ఏ మాత్రం సంబంధం లేని మరో విషయం మీదకి మనసు మళ్లాలి. ఉదాహరణకు పాటలు వినడం, డిస్కవరీ చానల్‌ లాంటివి చూడటం లేదా ఇంట్లోనే తేలికపాటి వ్యాయామం చేయడం వంటివన్నమాట.
అయితే కొందరు తల్లిదండ్రులకు ఇలాంటివి బొత్తిగా నచ్చవు. అందుకే అడుగడుగునా ఆంక్షలు విధిస్తారు. ఈ ధోరణితో పిల్లల మెదడు మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అయినా సరే ఆ బాధంతా అలాగే భరిస్తూ, కిక్కురుమనకుండా… రోజుకు 16 లేదా 18 గంటలు కళ్లను పుస్తకం మీదే పెడతారు. కొందరు తల్లిదండ్రులైతే పుస్తకంలోకి తలదూర్చినంత మాత్రాన చదువుతున్నాడన్న గ్యారెంటీ ఏమిటి అనుకుని బయటికి చదవమంటారు. నిజంగా ఇది పిల్లల గొంతుమీద కత్తిపెట్టడం లాంటిదే. ఇలా రకరకాలుగా కట్టడి చేస్తూ, తీరా పరీక్షలైపోయాక చూస్తే తక్కువ మార్కులే కనపడతాయి.
ఈ విధమైన ఫలితాలకు తల్లిదండ్రుల తప్పే ఎక్కువ. పిల్లలకు ఏ మాత్రం విరామం ఇవ్వకుండా, వారిని పరీక్షల పేరిట భయబ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం మంచిది కాదు. ప్రణాళికా బద్ధంగా చదివితే ఫలితం ఉంటుంది కానీ ‘చదువూ… చదువూ…’ అంటూ పిల్లల్ని వేధించడం వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశాలే ఎక్కువ. అందుకే పరీక్షా సమయాల్లో చదువుతో పాటు వినోదం పేరిట కాస్త విరామం ఇవ్వడం తల్లిదండ్రుల కనీస బాధ్యత.