Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గురువుకి వశవర్తియై ఆయన శాసకుడన్న భావనతో గురువు చెప్పినది పాటించేవాడిని శాస్త్రం ‘గురువ్రత’ అన్నది. గురువుకింత పెద్దస్థానం ఎందుకిచ్చారంటే ఆయన పురోహితుడు కనుక. వశిష్ఠులవారు ఇక్ష్వాకుల వంశానికి కుల పురోహితుడు. పురోహితుడంటే కేవలం వారి ఇంట్లో జరిగే శుభాశుభ కార్యక్రమాలలో మంత్రభాగాన్ని అన్వయించేవాడని కాదు. పుర హితం కోరి మంగళ కార్యక్రమాలను, ఆ తర్వాత చేయవలసిన విహిత కర్మలను చేయిస్తుంటాడు. తప్పేం కాదు. పురం–అంటే పూర్వంనుంచి ఆయన అలవాటు ఏంటంటే– హిత వాక్యాలను మాట్లాడడం.

ఏవో మాట్లాడి నవ్వించి చప్పట్లు కొట్టించుకోవడానికి మనోరంజకంగా మాట్లాడే మాటలు కావవి. పితికేటప్పుడు ఆవుపాలు పాత్రలో పడేటంత జాగ్రత్తగా చెవితో పట్టుకుని మనసులో పెట్టుకుని ఉద్ధరణకు ఉపయోగించుకోవాల్సిన మంచి మాటలను శాస్త్రాలనుండి, పురాణాలనుండి గ్రహించి అన్వయం చేసి కష్టపడి చెమటలు పట్టేటట్లుగా తన హితం కోరి మాట్లాడేవాడెవడో వాడు గురువు. లోకక్షేమం కోరి వశిష్ఠుడు నోరు విప్పాడు. ఈ హితకరమైన వాక్కులు ఆయన ఎప్పటినుంచో ఇస్తున్నాడు. ఆయనకు అదే పని. అందుకే రుషి తర్పణం వచ్చింది. మనకి రుషి జాతి వేరైపోయింది.

రుషి మనుష్యుడిగా పుట్టినా వేరే తర్పణం వచ్చింది. కారణం– ఆయన పురోహితుడయ్యాడు. ఎప్పుడూ హితవాక్కు పలుకుతాడు. అందుకే మనకు ఉపనిషత్తులొచ్చాయి. వశిష్ఠుడు చేసిన మహోపకారం ఎవరు చేస్తారు? రాముడికి రామనామం ఉంచడమే ఆయన చేసిన మహోపకారం. ‘రా’, ‘మ’..రెండూ తేలికయిన అక్షరాలు. ‘రా’ అగ్నిబీజం. ‘మ’ అమృత బీజం. ‘రా’ అన్నప్పుడు–పాపం కాలిపోయింది. అమృతబీజం కను ‘మ’ అన్నప్పుడు పాపాలు లోపలికి రాకుండా పెదవులు మూసుకుపోతాయి. ఈ రెండక్షరాలు పలికినంత మాత్రం చేత సమస్త పాపరాశి దహనమయిపోయి అనుగ్రహాన్ని పొందుతాం కనుక దార్శనికుడైన వశిష్ఠుడు ఆ నామాన్ని ఉంచాడు. నామకరణంలో ఎప్పుడో పలికిన హితవాక్కు ఇప్పటికీ మనందరికీ పనికొస్తున్నది. అంత హితం చేసినవాడు కాబట్టి పురోహితుడయ్యాడు.

గురుశిష్య సంబంధమనేది నరులలోనే కాదు, భగవంతునికి కూడా అన్వయమవుతుంటుంది. భగవంతుడు కూడా గురువన్న పేరు వినబడితే వంగిపోవాల్సిందే. కారణం–అది అంత ఉత్కృష్ట స్థానం. ‘నగురోరధికం, న గురోరధికం, న గురోరధికం.. ఇతి శివశాసనతః’ – గురువు కన్నా అధికుడు లేడు కాబట్టి గురువు అన్న మాటవినబడితే పరమేశ్వరుడు అవతారంతో వచ్చినా వంగిపోతాడంతే. చిత్రం ఏమిటంటే – అద్వైత సంప్రదాయంలో మొదటి గురువు నారాయణుడు, ఆయన శిష్యుడు బ్రహ్మ. బ్రహ్మ శిష్యుడు వశిష్ఠుడు. కాబట్టి అక్కడ నారాయణుడు వశిష్ఠులకు పరమగురువయ్యాడు. అటువంటి నారాయణుడు ఇక్కడ రాముడిగా వశిష్ఠుడికి శిష్యుడయ్యాడు. శిష్యుడిగా నారాయణుడు కూడా వశిష్ఠుడికి నమస్కారం చేయవలసిందే. నరుడిగా నమస్కరించాడంతే. అదీ గురుశిష్య సంబంధం అంటే. అదీ భగవంతుడు మనకు నేర్పిన మార్గం.

అందుకే పార్వతీ దేవి పరమశివుణ్ణి గురువుగా స్వీకరించింది. సహజంగా భర్త గురువు. భర్తకు మంత్రోపదేశం చేస్తే చాలు. తర్వాత భర్త భార్యకు చేస్తాడు. అలా భర్త దగ్గర పార్వతీ దేవి విద్య నేర్చుకుంది. మనుష్యులు తరించి పోవడానికి ఏదయినా చిన్న ఉపాయం చెప్పమని అడిగింది. రామ, రామ, రామ అని మూడు సార్లంటే వెయ్యి సార్లు విష్ణునామం చెప్పినట్లే. గురువయిన భర్తనుంచి ఆవిడ నేర్చుకుంది కాబట్టి మనకు అందింది.