Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మూగ జీవాలు గాయాల బారిన పడ్డాయని సమాచారం అందిన నిమిషాల్లో పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ ప్రతినిధులు అక్కడికి చేరుకుంటారు. జంతువు పరిస్థితిని అంచనా వేసి వాటికి ఎటువంటి అపాయం కలుగకుండా జాగ్రత్తగా ఒడిసిపట్టుకొని, తమ వాహనంలోకి తరలిస్తారు. శునకాల విషయంలో ప్రతినిధులు ముందస్తుగా అనేక చర్యలు తీసుకుంటారు. గాయపడ్డ కుక్కను గుర్తించిన వాలెంటీర్లు అవి పారిపోకుండా తమతో తెచ్చుకున్న వాహనాలను దూరంగా పెడతారు. పది నుంచి ఇరవై నిమిషాల పాటు సాధారణంగా ఉంటూ తమతో తెచ్చుకున్న వలలో గాయపడ్డ కుక్కలు చిక్కుకునేలా చేస్తారు. ప్రేమగా దగ్గరకు తీసుకొని వాటికి భయం పోయిందని నిశ్చయించుకున్నాక వాహనంలో ఎక్కిస్తారు. తమ చికిత్సాలయాలకు తీసుకెళ్లి వీటికి ట్రీట్‌మెంట్‌ చేస్తారు. వీధి కుక్కలే అధికంగా వస్తుండడంతో వాటిని బయటకు పంపించేటప్పుడు పూర్తి వాక్సినేషన్‌ వేసి పంపిస్తారు. దీని వల్ల ఎవరినైనా శునకం కరిచినా ముప్పు ఉండదని వైద్యులు చెబుతున్నారు. వైద్యం అందించాక మూగ జీవాలకు పౌష్టికాహారం పెట్టడం ద్వారా అవి కోలుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తారు ఈ ఎన్‌టీవోస్‌ సంస్థ ప్రతినిధులు.

మూగజీవాల విషయంలో మారుతున్న దోరణి

రోడ్డున పోయేటప్పుడు గాయపడ్డ మూగ జీవాలను చూస్తుంటాం. కాని వాటి గురించి అసలు పట్టించుకోం. కాని ఇప్పుడు నగర వాసుల్లో ఈ దోరణి మారుతోంది. గాయపడ్డ మూగజీవాల కోసం ఎదైనా చేయాలనే తాపత్రయం యువకుల్లో కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం కేబీఆర్‌ పార్క్‌ వద్ద రెండు శునకాలు గోడవ పడ్డాయి. ఇందులో ఓ శునకం చెవ్వికి గాయమవ్వడంతో వాకింగ్‌కు వచ్చిన ఇద్దరు యువకులు పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ కు ఫిర్యాదు చేశారు. ప్రతినిధులు వచ్చే వరకు అక్కడే ఉండి శునకాన్ని అప్పగించి వెళ్లారు. ఇదే విధంగా సాగర్‌సొసైటీలో ఓ శునకం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. కాలు విరగడంతో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు సమీపంలో ఉన్న ఆల్‌వెట్‌ పెట్స్‌ క్లీనిక్‌కు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు స్పందించి శునకం కాలికి శస్త్ర చికిత్స చేశారు.

 వీధి కుక్కల పట్ల ప్రేమగా ఉండాలి

వీధి కుక్కల పట్ల ప్రేమగా ఉండాలి. అవి కనబడగానే కొంత మంది రాళ్లతో కర్రలతో దాడులు చేస్తుంటారు. మూగ జీవాలను హింసించడం మంచిది కాదు. ఎక్కడైనా అవి గాయపడి కనిపిస్తే వెంటనే సమీపంలోని పెట్స్‌ క్లీనిక్‌కు తీసుకెళ్లండి. చాలా మంది ప్రైవేటు వైద్యులు వీధి కుక్కలకు ఉచితంగా చికిత్స చేస్తున్నారు.

ప్రైవేటు వైద్యులు సైతం 
తమ కళ్ల ముందు మూగ జీవాలకు ఏం జరిగినా తట్టుకోలేరు ప్రైవేటు క్లీనిక్‌ వైద్యులు. లాభం ఆశించకుండా వీధి కుక్కలను ఎవరు తీసుకువచ్చినా వాటికి దగ్గరుండి ఉచితంగా చికిత్సలు అందించి అవి కోలుకునే వరకు తమ వద్దే ఉంచుకుంటున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిసర ప్రాంతాల్లో సుమారు 15గాయపడిన జీవాలకు ప్రైవేటు వైద్యులే చికిత్స అందించారు.