Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దైవాజ్ఞ ధిక్కారానికి పాల్పడ్డ తొలి మానవులైన ఆదాము, హవ్వల దుశ్చర్యతో మానవ చరిత్రలో ఆరంభమైన దిగజారుడుతనం వారి కుమారుడైన కయీను కారణంగా మరింత వేగవంతమయింది. తన అర్పణను కాకుండా తన తమ్ముడైన హేబెలు అర్పణను దేవుడు లక్ష్యపెట్టాడన్న అక్కసుతో కయీను హేబెలను చంపి మానవ చరిత్రలో తొలి నరహంతకుడయ్యాడు. అది చూసిన దేవుడు నీ తమ్ముడెక్కడ అని నిలదీస్తే ‘అతనికి నేను కావలివాడనా?’ అంటూ దేవునికే ఎదురు తిరిగి దేవుని ఉగ్రత కారణంగా స్థిరత్వం లేక చంచలుడై జీవితాంతం అతనూ అతని జనాంగం కూడా దేశదిమ్మరులయ్యారు. అలా కయీను కారణంగా లోకానికి కోపం, అసూయ, అక్కసు, హత్య, అబద్ధం, దైవధిక్కారం, విద్వేషం వంటి ఎన్నో అవలక్షణాలు పరిచయమయ్యాయి. కాని ‘నీ తమ్ముడెక్కడ?’ అన్న దేవుని ప్రశ్నకు ‘నన్ను క్షమించు ప్రభూ!’ అని కయీను బదులిచ్చి ఉంటే, దేవుని క్షమాశక్తితో మానవ చరిత్రలో ఎంతో పతనానికి అడ్డు కట్టపడి ఉండేది (ఆది 4:2–15). నిజమే, పాపాలు మూటకట్టుకోవడమంటే తేలిక కాదు. దైవాశీర్వాదాలు సంపాదించుకోవడం, పగ, కోపం మనిషిని మరుగుజ్జుగా మార్చితే చేసిన తప్పుకు క్షమాపణ అడగడం ద్వారా ఆ మనిషే హిమాలయమంత ఎత్తుకు ఎదుగుతాడు. బలహీనులు తమ తప్పును ఒప్పుకోలేరు, క్షమాపణ అడగలేరు కూడా. క్షమాపణ అడగడం అత్యంత బలవంతుల సులక్షణం.

క్షమించే వ్యక్తి కన్నా క్షమాపణ అడిగే వ్యక్తి ఉన్నతమైనవాడు. ఎందుకంటే క్షమాపణతో తనకు లభ్యమయ్యే ప్రశాంతత, ఆనందం, ఆహ్లాదంలో కొంత భాగాన్ని క్షమించే వ్యక్తికి కూడా అతడు పంచుతాడు గనక. మన దౌర్భాగ్యమేమిటంటే, క్షమించమన్న భావనే కాని సారీ లాంటి నామమాత్రపు పదజాలాన్ని సృష్టించుకుని, అద్భుతమైన క్షమాశక్తిని మనమే నిర్వీర్యం చేసుకున్నాం. నిజమైన ప్రేమ అంటే క్షమించే నిరంతర శక్తి. అన్నది యేసుప్రభువు బోధల్లో, జీవితంలో కూడా నిరూపితం అయింది. లోకానికున్న ఏ రుగ్మతనైనా, మానవాళికున్న ఎంతటి దౌర్భాగ్యాన్నైనా స్వస్థపరచి ఆనందాన్ని పునరుద్ధరించగలిగిన దైవాస్త్రం, దివ్యౌషధం క్షమాపణ!!

అపరాధ భావనతో బరువెక్కిన జీవితాన్ని, మన గుండెను క్షమాపణ శక్తితో దూదిపింజకన్నా తేలికగా మార్చుకోగలిగి కూడా పగ, కక్ష, ప్రతీకా రానికి పాల్పడి జీవితాన్ని దుర్భరం చేసుకోవడం ద్వారా మనిషి అవివేకమంతా బయట పడుతోంది. మనం విషం తాగుతూ మన శత్రువులు చనిపోవాలనుకోవడమే, శత్రువులను క్షమించడానికి నిరాకరించి పగను పెంచుకోవడమన్న నెల్సన్‌ మండేలా మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే క్షమాశక్తిని ఎరిగిన సద్వర్తనుడు ఆయన. అందుకే ముళ్లకంపను కూడా పూలగుత్తిగా మార్చే శక్తి క్షమాపణది!! దేవుని అంతులేని ఔన్నత్యం, శక్తి ఆయన క్షమా స్వభావం ద్వారానే విడివడి, మానవాళిని పరలోక పౌరులను చేస్తుంది. ఈ లోకాన్ని ప్రేమ అనే పరిమళంతో నింపుతుంది