Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తున్న వేళ ప్రధాన ప్రత్యర్థులైన జాతీయస్థాయి అగ్రనేతలు నేడు తమిళనాడులో కాలుమోపుతున్నారు. అన్నాడీఎంకే–భారతీయ జనతాపార్టీ కూటమి అభ్యర్థుల కోసం ప్రధాని నరేంద్రమోదీ, డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి సభల్లో ప్రసంగించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం ఒకేసారి రాష్ట్రానికి చేరుకుంటున్నారు.రాష్ట్రంలో 39 లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 18న పోలింగ్‌ కాగా, 16వ తేదీ సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. అంటే ఎన్నికల ప్రచారానికి ఇక ఐదురోజులే ఉండడంతో అన్నిపార్టీలూ తమ పర్యటనలతో హోరెత్తిస్తున్నాయి.

నేడు నాలుగు సభల్లో రాహుల్‌ ప్రచారం: డీఎంకే కూటమికి చెందిన సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్‌ కారత్, బృందాకారత్‌ వంటి జాతీయ నాయకులు కొందరు ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారు. అలాగే ఇప్పటికేఒకసారి ప్రచారం నిర్వహించిన రాహుల్‌గాంధీ రెండో విడతగా ఈనెల 12న తిరుప్పరగున్రం, కృష్ణగిరి, సేలం, తేనీలలో జరిగే బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కృష్ణగిరికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సేలం, 3 గంటలకు తేని, సాయంత్రం 5 గంటలకు తిరుప్పరగున్రంలో ప్రసంగిస్తారు.