Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఈ నెల 16-20 తేదీల మధ్య మా దేశంపై దాడి చేసేందుకు భారత్‌ పథకం పన్నుతోందని, ఈ విషయమై తమకు విశ్వసనీయమైన నిఘా సమాచారముందని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ చెప్పుకొచ్చారు.

జమ్మూకశ్మీర్‌ పూల్వామాలో భారత సైనిక కాన్వాయ్‌ వెళుతుండగా.. జైషే మహమ్మద్‌కు చెందిన సూసైడ్‌ బాంబర్‌ తనను తాను పేల్చుకొని 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత వైమానిక దళం బాలకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై దాడులు జరిపింది. ఇందుకు ప్రతిగా పాకిస్థాన్‌ వైమానిక దళం.. భారత గగనతలంలోకి చొచ్చుకురావడం..భారత్‌కు చెందిన మిగ్‌-21 విమానాన్ని కూల్చడం తెలిసిందే. ఈ దాడి నుంచి తప్పించుకున్న ఐఏఎఫ్‌ పైలట్‌ అభినందన్‌.. ఈ క్రమంలో దాయాది భూభాగంలో దిగడం.. భారత్‌ తీసుకొచ్చిన అంతర్జాతీయ ఒత్తిడితో పాక్‌ అతన్ని మన దేశానికి తిరిగి అప్పగించడం తెలిసిందే.

ఈ క్రమంలో ఖురేషీ ఆదివారం ముల్తాన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ కొత్త పథకాన్ని రచిస్తోందని తమకు విశ్వసనీయమైన నిఘా సమాచారముందని, పాక్‌కు వ్యతిరేకంగా దాడి చేసేందుకు భారత్‌ సన్నాహాలు చేస్తోందని ఖురేషీ చెప్పుకొచ్చారు. ఈ దాడి ఏప్రిల్‌ 16-20 తేదీల మధ్య ఉండొచ్చునని తెలిపారు. పాక్‌పై తమ దౌర్జన్యాన్ని సమర్థించుకునేందుకు, దౌత్యపరంగా ఇస్లామాబాద్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్‌ ఈ దాడికి పూనుకుంటోందని, ఇదే జరిగితే ఉపఖండంలో శాంతి, సుస్థిరతలకు తీవ్ర విఘాతం తప్పదని ఆయన పేర్కొన్నారని డాన్‌ పత్రిక తెలిపింది.