Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఓటరుగా నమోదు.. అక్కడి నుంచే ఓటు.. విదేశీ పౌరసత్వం లేకపోతే చాలు

అవగాహన లేక నమోదుకు దూరం
ఇప్పటికి నమోదైంది కేవలం నలుగురే
ప్రచారం కల్పిస్తే లక్షల్లో కొత్త ఓటర్లు
అందరూ నమోదైతే కొన్ని చోట్ల కీలకం!
మీరు భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నారా? వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నారా? మీ ప్రాంతంలో ఓటేయలేకపోతున్నామన్న చింత వద్దు. మీరున్న చోట నుంచే ఓటు వేయవచ్చు. విదేశాల్లో ఉంటూనే ఓటు హక్కును పొంది.. మీ ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో ఆన్‌లైన్‌లో ఓటు వేయవచ్చు.

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల (ఎన్నారైల)కు కూడా భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) ఓటు హక్కు కల్పించింది. కానీ, దీనిపై ప్రచారం, అవగాహన కొరవడటంతో వారంతా ఓటరుగా నమోదు కావడంలేదు. ఇప్పటికే స్వస్థలంలో ఓటు హక్కు కలిగి ఉన్నా కూడా విదేశాల్లో ఉన్నందున.. ఓటును బదిలీ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు. దీంతో లక్షలాది మంది విదేశాల్లో ఉంటున్న కారణంగానే స్వదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ప్రవాస భారతీయులు ఓటు హక్కును పొందడం లేదని చెప్పడానికి ఇప్పటివరకు నమోదైన ఓటర్లే నిదర్శనం. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఖ్య సింగిల్‌ నెంబర్‌ డిజిట్‌లోనే ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నారైలది ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. రాష్ట్రంలో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో విదేశాల్లో ఉండి.. ఓటర్లుగా నమోదైనవారు కేవలం నలుగురే ఉన్నారు. ఇందులో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరిలో ఇద్దరు రంగారెడ్డి జిల్లా వాసులు కాగా, ఒకరు పెద్దపల్లి, మరొకరు వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వారు ఉన్నారు.

అవగాహన లోపమే కారణం..
ప్రవాస భారతీయులు కూడా ఓటరుగా నమోదు కావచ్చునని, ఓటింగ్‌లో పాల్గొనవచ్చుననే విషయంలో అవగాహన లోపం కారణంగానే నమోదు తక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ప్రవాస తెలంగాణవాసులు లక్షల్లోనే ఉంటారు. వీరిలో అవగాహన పెరిగితే… లక్షల్లో కొత్త ఓటర్లు నమోదవుతారని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్నవారు ఆ దేశ పౌరసత్వం పొంది ఉండకపోతే.. స్వదేశంలో ఓటుహక్కు పొందవచ్చు. పాస్ట్‌పోర్టు, వీసా, తమ స్వస్థలానికి సంబంధించిన ఆధారాలు ఆన్‌లైన్‌లోనే సమర్పించి, ఓటు హక్కు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో ఫారం-6ఎ నింపితే అర్హతలు పరిశీలించి ఓటుహక్కు కల్పిస్తారు. కాగా, ఈ అవకాశాన్ని వారం రోజులుగా 19 మంది మాత్రమే వినియోగించుకున్నారని, వీరిలో కొందరికి ఇప్పటికే ఓటుహక్కు కల్పించామని అధికారులు చెబుతున్నారు.

ఎన్నారై ఓట్లు కొన్ని చోట్ల కీలకం
ఎన్నారైలు అందరూ ఓటర్లుగా నమోదై.. ఆన్‌లైన్‌లో ఓటింగ్‌లో పాల్గొంటే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలు కీలకంగా మారతాయని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల నుంచి వేలాది కుటుంబాలు గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ర్టోరల్‌ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో ప్రవాస తెలంగాణ వాసులంతా దరఖాస్తు చేసుకుంటే లక్షల్లో ఓటర్లు పెరగనున్నారు. ఈ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో కీలకంగా మారనున్నాయి. దీంతో విదేశాల్లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పించి.. ఆన్‌లైన్‌ ద్వారా వారి ఓట్లను పొందడం కోసం ఇప్పటికే కొందరు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది.