Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘‘దేశంలో 80-90శాతం విద్యార్థులకు ఉద్యోగం సంపాదించడానికి అవసరమైన నైపుణ్యం ఉండడంలేదు. దీనికి విద్యావ్యవస్థలోని లోపాలే కారణం.’’ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి వ్యాఖ్య ఇది. ఈ మాటల్లో అతిశయోక్తి ఏమీలేదు. నాలుగేళ్లు ఇంజనీరింగ్‌ చేస్తారు. మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసేసి డిగ్రీలు తీసుకుంటారు. కానీ ఉద్యోగం సంపాదించేంత నైపుణ్యం మాత్రం వారికి ఉండడంలేదు. డిగ్రీలు చేతికొచ్చినా చాలామందికి కొలువులు రాక దేశంలో డిగ్రీలు సంపాదించిన వారిలో 60శాతం నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు.

అందుకే మూస ధోరణికి స్వస్తి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేధాశక్తిని పెంచడంతోపాటు జాబ్‌ ఓరియంటేషన్‌ ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నూతన సిలబస్‌ రూపొందించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లకు ఎంహెచ్‌ఆర్‌డీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్‌చాన్సలర్లతో ఎంహెచ్‌ఆర్డీ ఇటీవల ఓ భేటీ నిర్వహించింది. సుమారు 600మంది వీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా విద్యా విధానం ఉండాలని ఈ భేటీలో తీర్మానించారు.

అంతేకాక 10 అంశాలతో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి సిలబ్‌సలో పూర్తిగా మార్పులు చేయాలని ఎంహెచ్‌ఆర్డీ ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా ‘లెర్నింగ్‌ అవుట్‌కమ్‌ బేస్డ్‌ కరిక్యులమ్‌(ఫలితం ఇచ్చే చదువు ప్రణాళిక)’ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సిలబస్‌ విద్యార్థికి సంబంధం లేకుండా ఉండేది. కానీ ఇకపై విద్యార్థికి అవసరమైన(లెర్నర్‌ సెంట్రిక్‌) బోధనా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగం సంపాదించడానికి, స్వయం ఉపాధి పొందడానికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో పరిశోధనను పెంచేలా చర్యలు తీసుకోనున్నారు.

కాలేజీ… ఇండస్ట్రీ
విద్యార్థులకు తరగతి గతి బోధనే కాకుండా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌(ప్రయోగ పరిజ్ఞానం) కూడా వచ్చేలా నూతన సిలబ్‌సలో మార్పులు చేయనున్నారు. ఇందులో భాగంగానే సిలబస్‌ లో కొన్ని పాఠ్యాంశాలను పరిశ్రమ ఆధారిత అంశాలను చేర్చాలని నిర్ణయించారు. ప్రతి కాలేజీ కూడా కంపెనీలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ కాలేజీలు తప్పనిసరిగా ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అప్రెంటిషిప్ ను తప్పనిసరి చేశారు. ఈ విధానాన్ని ఇకపై కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.

అప్రెంటిషిప్ కు క్రెడిట్స్‌ కేటాయించనున్నారు. దీంతో విద్యార్థికి థియరీ నాలెడ్జ్‌తో పాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం విద్యార్థులకు థియరీ నాలెడ్జ్‌ ఉన్నప్పటికీ ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు వారు రాణించలేకపోతున్నారు. ఒకవేళ ఉద్యోగం సాధించినప్పటికీ అందులోనూ నిలబడలేకపోతున్నారు. విద్యార్థులు ఈ ఇబ్బందులను అధిగమించేలా సిలబ్‌సలో సమూల మార్పులు చేయనున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపే ప్రధాన లక్ష్యంగా సిలబ్‌సలో మార్పులు చేయనున్నారు.

సిలబస్‌ లోని ప్రతి పాఠ్యాంశం కూడా విద్యార్థికి ఓవైపు థియరీ నాలెడ్జ్‌ను.. మరోవైపు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ను అందించేలా రూపొందించనున్నారు. మెజారిటీ విద్యార్థులు సాఫ్ట్‌ స్కిల్స్‌లో వెనుకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా సిలబ్‌సను రూపొందిస్తారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధనలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగానే అధ్యాపకులకు కూడా బోధనలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.