Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అమెరికాలో శాశ్వత నివాస అనుమతి (గ్రీన్‌ కార్డు) పొందేందుకు వీలుకల్పించే ఈబీ-5 వీసాలకు.. ప్రస్తుతమున్న విధానం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఆ దేశం డిసెంబర్‌ 7 వరకూ గడువును ఇచ్చింది. నిజానికి సెప్టెంబర్‌ 30తోనే ఈ గడువు ముగియాల్సి ఉన్నా.. మరిన్ని రోజులు దీన్ని పొడగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీలు కల్పించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. ప్రస్తుత విధానంలో నిబంధనల మేరకు కనీసం రూ.7.2 కోట్లు అమెరికాలో పెట్టుబడి పెట్టిన విదేశీయులకు ఈబీ-5 వీసాలు ఇస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాల్లో అయితే.. రూ.3.6 కోట్లు పెట్టుబడి పెట్టినా సరిపోతుంది. అయితే రాబోయే నెలల్లో ఈ విధానాన్ని పూర్తిగా మార్చనున్నారు. కనీస పెట్టుబడి మొత్తాన్ని రూ.13 కోట్లకు.. నిర్దేశించిన ప్రాంతాల్లో అయితే రూ.9.7 కోట్లకు పెంచాలని ఒబామా హయాంలోని ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఈబీ-5 కోసం భారతీయుల నుంచి దరఖాస్తులు ఒక్కసారిగా పెరిగాయి. ఏటా ఈబీ-5 కింద 10వేల వీసాలను మాత్రమే అమెరికా జారీ చేస్తుంది. ఒక్కో దేశానికి 700 వీసాలను కేటాయిస్తారు. ఒక వేళ అంత మొత్తంలో ఓ దేశం నుంచి అభ్యర్థులు లేకపోతే.. వాటిని మిగతా దేశాలకు పంచుతారు. ఇప్పటివరకూ భారతీయులు పూర్తి కోటాను వినియోగించుకోలేదు. తొలిసారి ఇది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 సెప్టెంబర్‌ వరకు ఈబీ-5 కోసం భారతీయుల నుంచి వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 2017 ఆర్థిక సంవత్సరంలో 174 మంది భారతీయులు ఈ వీసాలను పొందారు. అంతకుముందు ఏడాది కన్నా అది 93% అధికం.