Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని మెజారిటీ బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. త్వరలో అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) ప్రభావం ద్రవ్యోల్బణంపై ఏవిధంగా ఉంటుందో ఒక అంచనాకు వచ్చేవరకూ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులకూ అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే.. పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించాల్సిందేనని కోరుతున్నాయి. ముఖ్యంగా గతేడాది(2016–17)లో ఆర్థిక వృద్ధి రేటు 8 శాతం నుంచి 7.1 శాతానికి పడిపోయిన నేపథ్యంలో జీడీపీకి ఊతమివ్వాలంటే రేట్ల కోత అనివార్యమనేది వారి వాదన. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) భేటీ 6, 7 తేదీల్లో జరగనుంది. 7న(బుధవారం) ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఆర్‌బీఐ ప్రకటించనుంది.

దిగొచ్చిన ద్రవ్యోల్బణం…
రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలలో భారీగా తగ్గి… 2.99 శాతానికి దిగొచ్చింది. గడిచిన కొన్నేళ్లలో ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. ప్రధానంగా ఆహార వస్తువుల రేట్ల తగ్గుదల రిటైల్‌ ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదం చేసింది. అదేవిధంగా టోకు ధరల సూచీ ఆధారిత(డబ్లూపీఐ) ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్‌ నెలలో నాలుగు నెలల కనిష్టమైన 3.85 శాతానికి చేరింది. ఆహార ధరలతోపాటు తయారీ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గడం దీనికి ముఖ్య కారణం. కాగా, కీలకమైన జీఎస్‌టీని ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై జీఎస్‌టీ ప్రభావంగా తటస్థంగానే ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మూడుసార్లూ ఎక్కడిరేట్లు అక్కడే…
ఏప్రిల్‌ 6న జరిగిన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. దీంతో వరుసగా మూడు సమీక్షల్లోనూ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించినట్లయింది. ఆర్‌బీఐ రెపో రేటు(బ్యాంకులకు అందించే స్వల్పకాలిక నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ప్రస్తుతం 6.25 శాతంగా ఉంది. అదేవిధంగా రివర్స్‌ రెపో రేటు(ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీరేటు) 6 శాతంగా ఉంది. ఇక నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌– బ్యాంకులు తమ డిపాజిట్‌ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం, దీనిపై బ్యాంకులకు ఎలాంటి వడ్డీ లభించదు) 4 శాతంగా కొనసాగుతోంది.

రేట్లు తగ్గవు..ఇక పెరగడానికే చాన్స్‌: నోమురా
ద్రవ్యోల్బణం తాజా తగ్గుదల స్వల్ప కాలికమేనని.. త్వరలో మళ్లీ పెరుగుదల బాటపట్టే అవకాశం ఉందని జపాన్‌ బ్రోకరేజి దిగ్గజం నోమురా అంటోంది. ప్రధానంగా ఉత్పాదకత తగ్గుదల, పెద్ద నోట్ల రద్దు తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులకు వస్తుండటం(రీమోనిటైజేషన్‌), ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సుల పెంపు వంటివి ద్రవ్యోల్బణాన్ని ఎగదోయొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇక ఆర్‌బీఐ రేట్ల తగ్గింపునకు అవకాశం లేదని.. భవిష్యత్తులో పెంచేందుకే చాన్స్‌ ఉందని నోమురా పేర్కొంది. ‘7న సమీక్షలో ఆర్‌బీఐ తటస్థ విధానం కొనసాగించవచ్చు.

వచ్చే ఏడాది మార్చి వరకూ రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండవని అంచనావేస్తున్నాం. ఏప్రిల్‌ 2018 తర్వాత అర శాతం రెపో పెంపునకు ఆస్కారం ఉంది. ద్రవ్యోల్బణం, వృద్ధి పెరుగుదల దీనికి కారణంగా నిలుస్తుంది’ అని తెలిపింది. బుధవారం నాటి సమీక్షలో ఆర్‌బీఐ రేట్లు యథాతథంగానే ఉంటాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అయితే, గతంతో పోలిస్తే పాలసీ ప్రకటనలో కొంత సరళతకు ఆస్కారం ఉందని తెలిపింది. ‘గత సమీక్షలో ద్రవ్యోల్బణం రిస్కులకు సంబంధించి ఎంపీసీ వెలిబుచ్చిన పలు అంశాలు ప్రస్తుతం శాంతించాయి. మరోపక్క, ఈసారి వర్షాలు బాగుంటాయన్న అంచనాలతో పాటు జీఎస్‌టీ పన్ను రేట్ల ప్రకటన, కమోడిటీ ధరల తగ్గుదల వంటివి కీలకం’ అని ఇక్రా వ్యాఖ్యానించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మే నెలలో 2.5 శాతం దిగువకు వస్తే గనుక, ఆగస్టు సమీక్షలో ఆర్బీఐ పావు శాతం రేట్లను తగ్గించవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌  నివేదికలో పేర్కొంది.

బ్యాంకర్లు ఏమంటున్నారు…
ప్రస్తుత ద్రవ్యోల్బణం పరిస్థితులు, అదేవిధంగా వ్యవస్థలో తగినంత ద్రవ్యలభ్యత(లిక్విడిటీ) నేపథ్యంలో ఈసారి సమీక్షలో ఆర్‌బీఐ రేట్లను తగ్గించకపోవచ్చని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) డిప్యూటీ ఎండీ, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ) అన్షుల కాంత్‌ పేర్కొన్నారు. అయితే, సమీక్ష ప్రకటన సందర్భంగా ఆర్‌బీఐ చేసే వ్యాఖ్యానాలు చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘బుధవారం నాటి సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిస్తుందని భావించడం లేదు. త్వరలో వెలువడనున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను పరిశీలించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది’ అని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కతూరియా వ్యాఖ్యానించారు.

తగ్గింపునకు మంచి అవకాశం: కార్పొరేట్లు
ద్రవ్యోల్బణం చాలా తక్కువ స్థాయిలోనే కొనసాగుతున్న నేపథ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐకి ఇది చాలా మంచి అవకాశమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చిన అంశాన్ని ఆర్‌బీఐ, ఎంపీసీలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తగ్గుదలతో ఆహారోత్పత్తుల రేట్లు దిగొచ్చాయి. ఆర్‌బీఐ దీన్ని సదావకాశంగా మలుచుకోవాలి’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది.