Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని ఇంటలెజిన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఐఈడీతో నింపిన తెలుపు రంగు స్కార్పియో వాహనంతో ముష్కరులు దాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కుల్గాం జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేయబడిన ఈ వాహనంతో ఇద్దరు వ్యక్తులు భారీ విస్పోటనానికి వ్యూహం రచించారని, అయితే దాడి ఎక్కడ జరుగుతుందన్న విషయంపై తమకు సమాచారం లేదని పేర్కొన్నాయి. ఈ మేరకు భద్రతా బలగాలు, పోలీసులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెక్‌పోస్టులలో తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసు వర్గాలను ఆదేశించారు.

కాగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గంలో పోలింగ్‌ కొనసాగుతోంది. దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక జమ్ము కశ్మీర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌, అసోం, బిహార్‌, ఒడిశా,చండీగఢ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ల్లోని పలు నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.