Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పల్నాటి యుద్ధంలో అసువులు బాసిన అందగాడు బాలచంద్రుడు. బ్రహ్మనాయుడి భార్య ఐతాంబ. వారికి చాలా కాలం పిల్లల్లేరు. ఎన్నెన్నో నోములు, నోచారు. అలా లేకలేక పుట్టినవాడు బాల చంద్రుడు. అప్పట్లో ఈ కుటుంబం ఉండేది నేటి ప్రకాశం జిల్లా మేడపి ప్రాంతం. బాలచంద్రుడికి అయిదేళ్లుండగా.. ఒకసారి జాతకాలు చూపించారు. ఈ పిల్లాడి వల్ల తండ్రికి మృత్యుగండం అని తేల్చేశారు జ్యోతిష్యులు.
బెంబేలెత్తి పోయాడు బ్రహ్మనాయుడు. కన్నబంధం కన్నా తన ప్రాణ భయం మిన్న. తన కుడి భుజం కన్నమదాసుని పిలిచాడు. కన్న కొడుకునే చంపేయమన్నాడు. కానీ కన్నమదాసుకి మనసొప్పలేదు. పాలబుగ్గల చంటి పిల్లాణ్ణి చూస్తూ చూస్తూ ఎలా వధించడం? అందుకే ఆ బాలుడిని బ్రహ్మనాయుడి తమ్ముడు పేరినాయుడి ఇంట ఉంచాడు. అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. యుద్ధనీతి, అస్త్రశస్త్ర విన్యాసం, విలువిద్య, గుర్రపుస్వారీ అన్నీ నేర్చుకున్నాడు.
 ఇంతలో పెళ్లీడుకొచ్చాడు బాలచంద్రుడు. మాచర్లలో గండు కన్నమనాయుడు అనే ధనవంతుడు ఉన్నాడు. ఆయన కూతురు మాంచాల. పెళ్లీడుకొచ్చింది. ఆ విషయం కన్నమదాసుకి తెలిసింది. ఓ రోజు బ్రహ్మనాయుడి కొలువుకి రమ్మని కన్నమనాయుడికి దాసు సలహా ఇచ్చాడు. మరోవైపు- అక్కడే నూనుగు మీసాల నూత్న యవ్వనుడు బాలచంద్రుడిని ప్రవేశ పెట్టాడు. ఎవరా అని అంతా ఆశ్చర్యపోయారు. జరిగిందంతా అరక్షణంలో చెప్పాడు కన్నమదాసు. కోపంతో బ్రహ్మనాయుడు ఊగిపోయాడు. అంతా సర్ది చెప్పారు. అయ్యిందేదో మంచికే కదా అన్నారు. ఆపై మాంచాల, బాలచంద్రుడి పెళ్లి జరిగింది. అంతలో పలనాటి యుద్ధం వచ్చింది. బ్రహ్మనాయుడు కారెంపూడి వెళ్లాడు కదనానికి. రాణి వాసానికి రక్షకుడిగా బాలచంద్రుడిని నియమించారు. తానూ యుద్ధానికి వెళ్లాలని ఉత్సాహపడ్డాడు. కానీ లాభం లేకపోయింది.
కాలక్షేపం కోసం- అనపోతు, బోర్నీడు, చంద్రన్న, మంచన్న, తేర్కుడు లాంటి స్నేహితులతో గడిపేవాడు. గుమ్మడికాయలాట, చెరకు పందాల ఆట ఆడేవారు. ఓరోజు బొంగరాలాటకి సిద్ధమయ్యారు. అంతా మొల్లరావి చెట్టు దగ్గర గుమిగూడారు ఆడడానికి. ఆడామగా, ఆబాల గోపాలమూ తరలివచ్చారు చూడడానికి. గాల్లోకి విసిరాడు. అది వెళ్లి వెళ్లి చట్రాతిని తాకి- పైకెళ్లి- సర్రున కిందకిదిగి- అన్నమ్మ అనే స్త్రీ కాలికి తగిలింది. ఆమె మూర్చపోయింది.
బాలచంద్రుడు కంగారుగా ఆమె దగ్గరికి వెళ్లాడు. సపర్యలు చేశాడు. తన పచ్చవన్నెల పట్టు వస్త్రాల్ని చింపి ఆమె కాలుకి కట్టాడు. కొంతసేపటికి ఆమె తేరుకొని కనులు తెరిచింది. కానీ ఏమీ అర్థం కాక- బాలచంద్రుడిని తిట్టింది- ‘‘నీ తండ్రి కారంపూడి పోరుకి వెళితే ఇక్కడ నీకు బొంగరాలాటా? కాంతలయెడ ఇంత పొగరా? సిగ్గులేదా?’’ అని నోరు పారేసుకొంది. ఆ పలుకులు ములుకుల్లా గుచ్చుకొన్నాయి బాలచంద్రుడికి. నేరుగా తల్లి దగ్గరకు వెళ్లాడు. తానూ యుద్ధానికి వెళ్తానన్నాడు. ఆమె ససేమిరా అంది.
‘‘భయపడుతున్నావా అమ్మా. మరి నేను నేర్చుకున్న యుద్ధ విద్యలు దేనికి?’’ అని ప్రశ్నించాడు. ఐతాంబకి అర్థమైంది. ఇక అతడిని ఆపలేమని. అందుకే భార్య మాంచాలకి చెప్పి యుద్ధానికి వెళ్లమంది. అందుకోసం మాచర్లకి పయనమవమంది. ఆలిని చూస్తే ఆవేశం తగ్గి మెత్తపడతాడేమోనన్నది ఆమె ఆశ. అతడు అత్తారింటికి వెళ్లే లోపు- బాలచంద్రుడి మనసుని మార్చమని- కోడలు మాంచాలకి కబురంపింది ఐతాంబ.
ఎదురుగా బాలచంద్రుడు. చాన్నాళ్లకి వచ్చిన ప్రాణకాంతుడు. మాంచాల సంబరపడిపోయింది. అంతలోనే నిరుత్సాహం. మనోనాథుడిని సమరానికి పంపాలా? వీర గంధం తెచ్చి వీరుడిగా సాగనంపాలా? పిరికితనం నూరిపోయాలా? సతమతమైంది మాంచాల. అత్తగారి మాట ఒకవైపు. భర్త పోరాటం మరోవైపు తేల్చుకోలేక పోయింది.
వెంటనే తల్లి రేఖాంబ దగ్గరకి వెళ్లింది. ఏది ధర్మమో చెప్పమంది. ‘‘యుద్ధం చెయ్యడం మానవ కర్తవ్యం. ప్రాణాలు ఇక్కడ శాశ్వతం కాదు. మరణం ఎప్పుడూ పొంచి ఉంటుంది. దానిని తప్పించే శక్తి ఎవరికీ లేదు. భావి మానవుల హృద్భవనాలలో నీ భర్త స్ఫూర్తిని నింపు’’. ఈ మాటలు బలంగా పని చేశాయి మాంచాలపై. చిరునవ్వు వెలసింది బాలచంద్రుడి పెదాలపై. నిర్మలత్వం వెల్లివెరిసింది మాంచాల మోముపై. ఆమె వీరాంగనయైు బాలచంద్రుడికి శౌర్య తిలకం దిద్ది సమరానికి సాగనంపింది. యుద్ధంలో బాలచంద్రుడు మరణించి ఉండొచ్చు. కానీ పౌరుషంతో పోరాడి నేటికీ జీవించి ఉన్నాడు.