Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సమస్త జీవరాశుల్లో ఆత్మను సందర్శించగల జీవి కేవలం మానవుడు మాత్రమే. మనకు తెలిసినంత వరకూ ఆత్మ పరిణామ క్రమంలో మానవునిది ఒకానొక ఉత్కృష్ట స్థాయి. మానవుడు తన దేహంలో ఉన్న మనసును ఆసరాగా చేసుకుని మాత్రమే ఆత్మను సందర్శించగలడు. దేహం అనేదొక ఒక పదార్థం. ఈ పదార్ధం, ఆత్మ లేక అనంతశక్తి పరిణామం చెందగా ఏర్పడింది. అంతర్లీనంగా చూస్తే పదార్థమే శక్తి, శక్తే పదార్థం. అదే అభేదం, ఆ అభేదాన్ని తెలిపేదే అద్వైతం. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడమే ‘ప్రజ్ఞానం బ్రహ్మ’. పంచభూతాల మేలిమి సమ్మేళనమైన శరీరం చైతన్యరాహిత్యం అయినప్పుడు మాత్రమే తిరిగి పంచభూతాల రూపంలోకి మారడం ప్రారంభిస్తుంది.

శరీరం స్త్రీపురుషుల సంగమంతో పిండరూపంగా ప్రారంభమవుతుంది. ఐతే, ఇక్కడ సూక్ష్మమైన రూపంలో ఉన్న పిండం మానవ ఆకృతిని ఎలా పొందుతుందనే ప్రశ్న వేసుకుంటే, తల్లి తీసుకునే ఆహారం ద్వారా అనే జవాబు వస్తుంది. తల్లి స్వీకరించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతిలో రూపుదిద్దుకున్నాయి. అంటే శక్తి రూపాలైన పంచభూతాలు అనుకూల పరిస్థితుల్లో అత్యద్భుతంగా కలిస్తే ఏర్పడేదే జీవపదార్థం. తొలుత బీజరూపంగా ఉన్న పదార్థం, ఇతర జీవపదార్థాలను స్వీకరించి వివిధ పూర్ణరూపాలుగా పరిణమిస్తాయి. బీజరూపంగా ఏర్పడినది మొదలుకుని, చైతన్యరహితంగా ఏర్పడే వరకూ ఆ పదార్థాన్ని ప్రాణిగా చూస్తాం. ప్రయాణం మొత్తాన్ని జీవ ప్రయాణంగా పరిగణిస్తాం.

ఈ ప్రయాణం ప్రారంభమవడమంటే, అనంతశక్తి లేక ఆత్మలో కొంత భాగం జీవశక్తిగా మారటమే. అందుకే, ‘ఛాందోగ్యోపనిషత్తు’ ఈ దేహాన్ని భగవంతుడు నివసించే పురం(బ్రహ్మ పురం)గా అభివర్ణించింది. ఆత్మ శరీరరూపంలోకి మారి, నివసించే గృహం ఈ దేహం. మరణానంతరం ప్రాణం ఏమవుతుందని నచికేతుడనే జ్ఞానపిపాసి, యముడు అనే జ్ఞానిని ప్రశ్నిస్తాడు. అందుకు ఆ జ్ఞాని, ఒకే అగ్ని ప్రపంచంలో వివిధ ఆకృతుల్లో ఏవిధంగానైతే విరాజిల్లుతుందో, ఒకే వాయువు వివిధ ఆకృతులలో ఏవిధంగానైతే పరిఢవిల్లుతోందో, అలాగే ఆత్మ వివిధ జీవుల్లో ఆయా ఆకృతుల్లో విరాజిల్లుతుందని ‘కఠోపనిషత్తు’లో తెలుపుతాడు.