Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సొంతగడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి చెందడంపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అసహనం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే పిచ్‌పై తమ అంచనా తప్పిందని, దీంతోనే మ్యాచ్‌ చేజార్చుకోవాల్సి వచ్చిందని పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘కోట్లా పిచ్‌పై హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ స్పందించిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. మ్యాచ్‌కి ముందు గ్రౌండ్స్‌మెన్‌తో మాట్లాడితే.. ఈ పిచ్ బెస్ట్ అంటూ చెప్పారు కానీ.. అది చెత్త పిచ్‌ అని మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే అర్థమైంది. పిచ్ నెమ్మదిగా స్పందించడమే కాకుండా.. అనూహ్యమైన బౌన్స్‌ కూడా లభించింది. హైదరాబాద్ బౌలర్లకు ఈ పిచ్‌ సరిగ్గా సరిపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని.. పిచ్‌కు తగ్గట్లుగా బౌలింగ్‌తో చెలరేగారు. నకుల్‌ బాల్స్‌, స్లో బాల్స్‌తో మా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు.

దురదృష్ణవశాత్తు మా జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఈ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మా సొంతమైదానంలో ప్రత్యర్థుల కంటే మెరుగ్గా ఎలా ఆడాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మూడు మ్యాచ్‌లు జరగ్గా.. రెండు మ్యాచ్‌ల్లో మా ప్రత్యర్థులు మాకంటే మెరుగ్గా రాణించి విజయం సాధించారు. ఈ విషయంలో మేం మెరగువ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పిచ్‌లున్నప్పుడు జట్టు కూర్పుపై కూడా ఒకసారి ఆలోచించాలి. మా బౌలర్లుకు ఈ తరహా పిచ్‌ సరైంది కాదు. మేం పిచ్‌ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. గ్రౌండ్స్‌మెన్‌ చెప్పినట్లు కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోవడం మావంతైంది. ఇక మా బ్యాట్స్‌మెన్‌ చెత్త షాట్లు కూడా మా కొంప ముంచింది. పృథ్వీ షా చెత్త షాట్‌తో వెనుదిరిగాడు. కొంతమంది సీనియర్‌ ఆటగాళ్లు కూడా అలానే ఆడి మూల్యం చెల్లించుకున్నారు. మేం 160-165 పరుగులు చేస్తామనుకున్నాం. ఈ విషయాలపై చర్చించి మా తప్పులును తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లను నిందించదల్చుకోలేదు. వారి శక్తి మేరకు అద్భుతంగా రాణించారు. స్వల్పస్కోర్‌తోనే 19వ ఓవర్‌ వరకు పోరాడటం అద్భుతం. బ్యాటింగ్‌ వల్లే ఓడిపోవాల్సి వచ్చింది’ అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే హైదరాబాద్ 131/5తో ఛేదించింది.