Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వచ్చే మాట నిజమే. సెల్‌ టవర్‌కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్‌ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్‌ కనెక్ట్‌అవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్‌ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సెల్‌ఫోన్‌ వాడటం వల్ల మెదడులో గడ్డలు వస్తాయన్న అపోహలు చాలామందిలో ఏర్పడ్డాయి. అయితే సెల్‌ఫోన్‌ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి ఇంతవరకు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదు. ఇంతవరకు జరిగిన అధ్యయనాల్లో ఫోన్లు, సెల్‌ టవర్ల నుంచి రేడియేషన్‌ వెలువడుతుందని గుర్తించినా, అది క్యాన్సర్‌కు దారితీస్తాయని కచ్చితంగా చెప్పడానికి గల ఆధారాలే లేవు. కొన్ని అధ్యయనాలు మొబైల్‌ఫోన్స్‌తో మెదడుకు క్యాన్సర్‌ ప్రమాదం ఉందని చెబితే… మరికొన్ని అలాంటిదేమీ లేదని తేల్చాయి.

అయితే ఈ రెండు రకాల అధ్యయనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తూ వచ్చాయి. అయితే ఒక అంశం మాత్రం స్పష్టం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సెల్‌ఫోన్స్‌ వెలువరించే రేడియేషన్‌ స్థాయి తగ్గుతూ పోతోంది. పైగా మొబైల్స్‌ వాడకం ఆధునిక జీవితంలో భాగంగా మారింది. క్యాన్సర్‌ ప్రమాదం గురించి అనుమానాలు, భయాలు వ్యాప్తిలో ఉన్నా మొబైల్‌ఫోన్స్‌ను పూర్తిగా విస్మరించడం సాధ్యం కావడం లేదు. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనాలు పూర్తి వాస్తవాలను తేల్చిచెప్పేలోపు మనం కొన్ని మందు జాగ్రత్తలను పాటించాలి.