Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేయడంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుత చాంపియన్స్‌ ట్రోఫీలో ఇప్పటివరకు ఇదే తమ ఉత్తమ ప్రదర్శన అని పేర్కొన్నాడు. చావో-రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సఫారీ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా సెమీస్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌ అనం‍తరం కోహ్లి విలేకరులతో మాట్లాడాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఈ రోజు మ్యాచ్‌లో మా తరఫున వేలెత్తి చూపడానికి ఎలాంటి పొరపాట్లు లేవు. ఇది మా అత్యుత్తమ గేమ్‌ అని చెప్పవచ్చు’ అని అన్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ అయిన దక్షిణాఫ్రికాను మొదట 191 పరుగులకు పరిమితం చేయడమే కాకుండా..  ఆ తర్వాత కేవలం రెండు వికెట్లే కోల్పోయి భారత విజయం సాధించింది.  విరాట్‌ కోహ్లి (76 నాటౌట్‌), శిఖర్‌ ధావన్‌ (78) బాగా రాణించడంతో టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.

టాస్‌ గెలువడం కలిసొచ్చింది!
‘టాస్‌ గెలువడం కలిసొచ్చింది. వికెట్‌ పెద్దగా మారలేదు. బ్యాటింగ్‌కు మైదానం బాగా సహకరిస్తుందని మేం భావించాం. మా బౌలర్లు నిజంగా చాలా బాగా ఆడారు. ఫీల్డర్లు శక్తివంచన లేకుండా కృషి చేశారు. మైదానంలో మేం పరిపూర్ణ ఆటతీరును కనబరిచాం’ అని కోహ్లి వివరించాడు. ‘మేం అవకాశాలను చాలా బాగా ఒడిసిపట్టుకున్నాం. అందువల్లే అంత బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లైనఫ్‌ను 190 పరుగులకు పరిమితం చేయగలిగాం. ఏబీ డివిలియర్స్‌ త్వరగా ఔట్‌ చేయడం మంచిదైంది. అతను మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థిని దెబ్బతీయగలడు. అతన్ని ఔట్‌ చేయడం మ్యాచ్‌లో మాకు గొప్ప మలుపు. జట్టు సభ్యులు అంత తీవ్రత పెట్టి ఆడటం ఎంతో బాగుంది’ అని కోహ్లి వివరించాడు.