Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దాదాపు ప్రతి కుటుంబంలో లేదా బంధుమిత్రులలో ఎవరో ఒకరు  ఏదో ఒక ప్రత్యేక సందర్భాలలో విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తున్నప్పుడు ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆ దేశంలోని కరెన్సీలోకి మన కరెన్సీని మార్చకోవలసి ఉంటుంది. (ఉదా: యు.ఎస్. వెళుతుంటే రూపాయలను డాలర్లలోకి మార్చుకోవాలి). అలాగే విదేశాల నుంచి మన దేశానికి డబ్బు పంపిస్తున్నప్పుడు అక్కడి కరెన్సీని మన రూపాయలలోకి మార్చుకోవలసి ఉంటుంది. మారకపు విలువను మన దేశంలో రిజర్వు బ్యాంకు వివిధ అంశాల ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటుంది.

ఈ కరెన్సీ మారకపు విలువ ఆధారంగా కరెన్సీ డెరివేటివ్స్ 2008లో ప్రారంభం అయ్యాయి. మొదట ‘కరెన్సీ ఫ్యూచర్స్’ని ప్రారంభించారు. తరువాత  2010లో ‘కరెన్సీ ఆప్షన్స్’ని కూడా మొదలుపెట్టారు. ఈ కరెన్సీ డెరివేటివ్స్‌ని ఉపయోగించుకుని కరెన్సీ మారకపు విలువ హెచ్చుతగ్గుల నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి ముందుగా జాగ్రత్త పడవచ్చు.

ఉదాహరణకు ఒక వ్యక్తి తన కుమారుడిని 3 నెలల తర్వాత పైచదువుల కోసం అని యు.ఎస్. పంపించ దలచుకున్నారనుకుందాం. ప్రస్తుతం డాలరుకు 67 రూ. మారకపు విలువ అనుకుంటే కనుక 1500 డాలర్లు కావాలంటే 1,00,500 రూ. అవసరమౌతాయి. అయితే 3 నెలల తర్వాత కూడా డాలరుకు కరెన్సీ మారకపు విలువ ఇంతే ఉంటుందని గ్యారెంటీ లేదు. పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. తగ్గితే మంచితే కానీ, పెరిగితే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి ఆ తండ్రి యు.ఎస్.డాలరు కరెన్సీ ఫ్యూచర్ తీసుకుంటే లాభం గానీ, నష్టం గానీ లేకుండా తను అనుకున్న మారకపు విలువకు డాలర్లను పొందవచ్చు.

ఇక ఈ కరెన్సీ డెరివేటివ్స్ ఎలా పనిచేస్తాయో, ఖాతా ఎలా ప్రారంభించాలో చూద్దాం. ఎక్స్ఛేంజీలలో ఎవరైతే కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కి సభ్యత్వం తీసుకుంటారో వారి దగ్గర ఖాతాను ప్రారంభించవచ్చు. ట్రేడింగ్ సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు, ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు ఉంటుంది. మొత్తం నాలుగు రకాల కరెన్సీలలో కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి : యు.ఎస్. డాలరు, యూరో, పౌండు స్టెర్లింగ్. జపనీస్ ఎన్. లాట్ సైజ్ జపనీస్ ఎన్ కి మాత్రమే 100000 ఒక యూనిట్‌గా ఉంటుంది. మిగతా మూడింటికి 1000 ఒక యూనిట్‌గా ఉంటుంది.

ప్రతి కాంట్రాక్టు 12 నెలల కాలపరిమితి కలిగి ఉంటుంది. రేటు నాలుగు డిసిమల్స్‌లో కోట్ అవుతూ 0.25 పైసా / ఐ.ఎన్.ఆర్ 0.0025 టిక్  సైజ్ కలిగి ఉంటుంది.     ఉదా: 67.0025; 67.0050 లా కోట్ ఉంటుంది. లాస్ట్ ట్రేడింగ్ డే అనేది ఆ కాంట్రాక్టు చివరి నెల చివరి బిజినెస్ డే కన్నా రెండు రోజుల ముందు వరకు ఉంటుంది.  కాంట్రాక్టు సెటిల్‌మెంట్ ఇండియన్ రుపీస్‌లో మాత్రమే జరుగుతుంది.  కాంట్రాక్టు తీసుకున్న తర్వాత ప్రతి రోజూ సెటిల్‌మెంట్ ప్రైస్‌కి సెటిల్ చేస్తారు.  ఫైనల్ సెటిల్‌మెంట్ ఆర్.బి.ఐ. రిఫరెన్స్ ప్రైస్ ఆధారంగా జరుగుతుంది.  కాంట్రాక్టు తీసుకున్నప్పుడు మొత్తం కాంట్రాక్టు విలువను కట్టనవసరం లేదు. ఎంత మొత్తాన్నైతే మార్జిన్‌గా నిర్ణయిస్తారో అంతవరకు కడితే సరిపోతుంది.

పై చదువులకు వెళ్లే వారికి, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారికి, అలాగే తాము విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబానికి సొమ్మును పంపించేవారికి ఈ కరెన్సీ డెరివేటివ్స్ అనేవి మారకపు విలువ హెచ్చుతగ్గుల ఇబ్బందులను దాటడానికి బాగా తోడ్పడతాయి. ఇక ‘కరెన్సీ ఆప్షన్’ గురించి మరోసారి తెలుసుకుందాం.