Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సాక్షాత్తూ రాజ‌ధాని న‌డిబొడ్డున ఉన్న వేల కోట్ల విలువైన భూముల్ని క‌బ్జా చేశారంటే అందులో ప్ర‌భుత్వాధీశుల వాటా ఎంత‌? ఇది స‌హ‌జంగానే వ‌చ్చే సందేహం. ఈ ప్ర‌శ్న‌కు సీఎం కేసీఆర్ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. సీఎం ప్ర‌మేయం నేరుగా ఉందా? లేక ప‌రోక్షంగా స‌హ‌కారం అందిందా? లేక అనుచ‌రులైన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రాప‌కం ఏదైనా ఇందులో ఉందా? లాంటి స‌వాల‌క్ష సందేహాలొస్తాయి.తేదేపా ఎమ్మెల్సీ దీపిక్ రెడ్డి అరెస్టు నేప‌థ్యంలో ల్యాండ్ క‌బ్జాల్లో కొత్త కోణాలెన్నో బ‌య‌ట‌కు తెలిశాయి. ఇంకా తెలిసేవి చాలానే ఉన్నాయి. జె.సి.దివాక‌ర్ రెడ్డికి ద‌గ్గ‌ర బంధువైన దీపిక్ ఎంత‌మందిని ప్ర‌భావితం చేశాడో తెలిస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మాల్సిందే. మెహ‌దీప‌ట్నం- గుడి మ‌ల్కాపూర్ ప‌రిస‌రాల్లోని 45 ఎక‌రాల విలువైన ప్ర‌భుత్వ భూమిని అత‌డు క‌బ్జా చేసి ఇత‌రుల‌కు అమ్మేశాడంటే మ‌రి ఎంత పెద్ద గూడుపుటానీ న‌డించిందో అర్థం చేసుకోవ‌చ్చు. అస‌లే ఈ భూమి పేద‌ల కోసం డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు క‌ట్టిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన భూమి.. దానిని ప్ర‌భుత్వం కాపాడుకోలేక‌పోయింది.

అంటే దాని వెన‌క ఎంత పెద్ద గూడు పుటానీ ఉందో? క‌నీసం ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయాల‌న్న కామ‌న్ సెన్స్ కూడా ప్ర‌భుత్వానికి లేదా? లేదూ అస‌లు త‌తంగం వేరే న‌డిచిందా? ప‌్ర‌స్తుతం ఊరూ వాడా మాట్లాడుకుంటున్న విష‌య‌మిది. అలాగే ప్ర‌తిప‌క్ష‌, విప‌క్షాలు ఈ విష‌యంపై ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నాయి. అన్నిటికీ ప్రభుత్వం స‌మాధానం చెప్పాల్సిందే. అధికారుల‌కు లంచాలు ఎర‌వేసి, డాక్యుమెంట్లు ఫోర్జ‌రీ చేసి దీప‌క్ రెడ్డి ఆడిన ఆట గురించి సీసీఎస్ పోలీసులు నిజాలు నిగ్గు తేలుస్తుంటే వినేవాడికి చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయ్‌. ఇదే కాదు హైద‌రాబాద్ చుట్టూ ఉన్న భూముల‌పై రాబందుల‌న్నీ రాజ‌కీయనేత‌లే. హైద‌రాబాద్ ఇబ్ర‌హీం ప‌ట్నంలో మాజీ మ‌హిళా కార్పొరేట‌ర్ 38 ఎక‌రాలు నొక్కేసిందంటే అర్థం చేసుకోవ‌చ్చు.. ప‌రిస్థితి. ఇలాంటి గొడ‌వ‌లు పెద్ద‌ల స‌పోర్ట్ లేకుండా జ‌రుగుతాయా? అంటూ ఒక‌టే ర‌చ్చ సాగుతోంది. మ‌రి వీటన్నిటికీ తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెబుతుందో లేదో చూడాలి.