Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలంగాణ వ‌స్తే ఉద్యోగాలొస్తాయ్‌. నోటిఫికేష‌న్లు వ‌రుస‌గా ఇత్త‌రు… ఉపాధి క‌రువే ఉండ‌దు.. నిరుద్యోగం స‌మ‌సిపోతుంది.. అంటూ తెగ ఊద‌ర‌గొట్టిండ్రు లోక‌ల్ లీడ‌ర్స్. కేసీఆర్ సాబ్ వ‌స్తే వెంట‌నే ఉద్యోగాల స‌మ‌స్య ఉండ‌ద‌ని నిరుద్యోగ యువ‌త క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూశారు. అయితే ఇక్క‌డ అంతా రివ‌ర్స్‌. ఇదిగో నోటిఫికేష‌న్ అంటే అదిగో నోటిఫికేష‌న్ అంటూ ఊరించ‌డం త‌ప్ప రిక్రూట్‌మెంట్ జీరో. ఇప్ప‌టికి గ్రూప్స్ నోటిఫికేష‌న్లు ఇచ్చినా .. టీచ‌ర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ల‌క్ష‌లాది నిరుద్యోగులు మాత్రం నాలుగున్న‌రేళ్లుగా నిరాశ‌తోనే ఎదురు చూడాల్సొస్తోంది. అయితే మొన్న‌టికి మొన్న 7వేల పైచిలుకు గురుకుల్ టీచ‌ర్ ఉద్యోగాలు అంటూ ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డంతో నిరుద్యోగుల క‌ళ్ల‌లో ఆనందం తొంగి చూసింది. దాంతో కోచింగ్ సెంట‌ర్లు కిట‌కిట‌లాడాయి. అయితే ఇంత‌లోనే పెద్ద షాక్‌.

ఈసారి టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ చేప‌ట్టిన టీఎస్‌పీఎస్సీ కొత్త రూల్స్‌తో గుండె పోటు తెప్పించింది. ల‌క్ష‌లాది నిరుద్యోగుల్ని రోడ్డున ప‌డేసింది. గురుకుల్ టీచ‌ర్ కావాలంటే డిగ్రీ 60 శాతంతో పాస్ అయ్యి ఉండాల‌ని రూల్ పెట్టింది. టీచ‌ర్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లోనే తొలిసారి ఈ రూల్ పెట్టారు. దీంతో ల‌క్ష‌లాది విద్యార్థులు రోడ్డున‌ప‌డ్డారు. ఏళ్ల‌కు ఏళ్లు కోచింగ్ సెంట‌ర్ల వెంట‌ప‌డి ల‌క్ష‌లు త‌గ‌లేసి కోచింగులు తీసుకుంటే, టెట్ క్వాలిఫై అయ్యి, బీఈడీ ప్ర‌థ‌మ‌శ్రేణిలో పాస్ అయ్యి కేవ‌లం డిగ్రీ 60 శాతం లేద‌న్న కార‌ణంతో ఇప్పుడు జీరో అయిపోవాల్సొచ్చింద‌న్న వేద‌న క‌న‌బ‌రుస్తున్నారంతా. అలాగే బీకాం వాళ్లు సోష‌ల్ టీచ‌ర్లు కాలేరంటూ వారిని డిస్ క్వాలిఫై చేయ‌డంపైనా అభ్య‌ర్థులు విరుచుకుప‌డుతున్నారు.

ఐఏఎస్‌, ఐపీఎస్ అయ్యేవాళ్ల‌కే లేని రూల్స్‌, గ్రూప్స్ రాసేవాళ్ల‌కు లేని రూల్స్ కొత్త‌గా మాకేంటి అంటూ టీచ‌ర్ ఉద్యోగార్థులు నిన్న‌టిరోజున టీఎస్‌పీఎస్సీ భ‌వంతి ముందు ధ‌ర్నాకు దిగారు. త‌మ గోడు వినిపించారు. ఇది కేసీఆర్‌, టీఎస్‌పీఎస్సీ క‌లిసి చేస్తున్న కుట్ర‌. నిరుద్యోగుల పొట్ట కొట్టే ప్లాన్ అంటూ ప‌లువురు ఆరోపించారు. ఊహించ‌ని కొత్త రూల్స్‌తో విద్యార్థుల, నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారంటూ రోడ్లెక్కి నిన‌దించారు. ఇక ఆడ‌వాళ్లు అయితే టెన్త్ డిస్టింక్ష‌న్‌, ఇంట‌ర్ డిస్టింక్ష‌న్‌, డిగ్రీలో పెళ్ల‌యిపోవ‌డం వ‌ల్ల యావ‌రేజ్ మార్కులు వ‌చ్చాయి. అయినా ఆ త‌ర్వాత బీఈడీ ఫ‌స్ట్ క్లాస్‌, టెట్ డిస్టింక్ష‌న్‌లో పాస్ ఇన్ని ఉండీ డిగ్రీలో 60 శాతం లేని కార‌ణంగా మ‌మ్మ‌ల్ని డిస్‌క్వాలిఫై చేస్తారా? అంటూ విరుచుకుప‌డుతున్నారు. సైన్స్ విద్యార్థుల‌లో కొంద‌రిని అకార‌ణంగా డిస్‌క్వాలిఫై చేయ‌డంపైనా పెద్ద ఎత్తున ఉద్య‌మం చేప‌డుతున్నారు విద్యార్థులు. ఇక ఎస్సీ, ఎస్టీల‌తో స‌మానంగా బీసీల‌కు 55 శాతం ఉంటే డీఎస్సీ రాసుకునే ఛాన్స్ ఉండేది. అలాంటిది ఈసారి బీసీల్ని ఓసీల్లో క‌లిపేస్తూ కేవ‌లం ఎస్సీ ఎస్టీల‌కే 55 శాతం రూల్ వ‌ర్తింప‌జేశారు. దీనిపై బీసీ ఉద్య‌మ‌నేత ఆర్‌.కృష్ణ‌య్య ఉద్య‌మానికి దిగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌టే నోటిఫికేష‌న్ కొన్ని ల‌క్ష‌ల స‌మ‌స్య‌ల్ని తెచ్చింది సీఎంగారూ? మ‌రి వీట‌న్నిటికీ కేసీఆర్ ఫ్ర‌భుత్వం, టీఎస్‌పీఎస్సీ క‌మిటీ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.