Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నిత్యమూ తనకు రక్షణగా ఉంటూ, వెన్నంటి కాపాడే గన్ మెన్ దురదృష్టవశాత్తూ కరెంట్ షాక్ తో మరణించగా, అతని మృతదేహాన్ని చూసిన ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ బోరున విలపించారు. ఆమె వద్ద గన్ మెన్ గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ సుల్తాన్ (30), తన రోజువారీ విధుల్లో భాగంగా ఆఫీసుకు వచ్చి, డ్రస్ మార్చుకునేందుకు గదిలోకి వెళ్లిన వేళ కరెంట్ షాక్ తగిలింది. అది రేకుల షెడ్ కావడం, ఓ విద్యుత్ వైరు తెగివుండటం, రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ రేకుల్లోకి సరఫరా అవుతుండటం సుల్తాన్ ప్రాణాలు తీశాయి.

కరెంట్ షాక్ తో సుల్తాన్ కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, స్పందించిన మరో గన్ మెన్, ఇతరుల సాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ, సుల్తాన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విషయాన్ని తెలుసుకున్న సుప్రజ ఆగమేఘాల మీద ఆసుపత్రికి చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాద వివరాలు తెలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ తదితరులు సుల్తాన్ కు నివాళులు అర్పించారు. కాగా, పది రోజుల క్రితం సుల్తాన్ కు బదిలీ ఆర్డర్లు రాగా, ఏవో కారణాలతో అతన్ని రిలీవ్ చేయలేదని తెలుస్తోంది.