Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇటీవల జరిగిన ఐపీఎల్‌–10 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్‌ యువ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు అద్భుత అవకాశం తలుపు తట్టింది. అతను జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎస్‌సీఏ)లో ఫాస్ట్‌ బౌలింగ్‌ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. బెంగళూరులో ఈనెల 19 నుంచి రెండు వారాల పాటు ఎంపిక చేసిన యువ బౌలర్లకు ఈ శిక్షణను అందిస్తారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుంది.

సిరాజ్‌తో పాటు బాసిల్‌ థంపి, నవ్‌దీప్‌ సింగ్, నాథూ సింగ్, అనికేత్‌ చౌదరీ, సిద్ధార్థ్‌ కౌల్, అంకిత్‌ రాజ్‌పుత్‌ ఎన్‌సీఏ శిబిరంలో పాల్గొంటారు. శిక్షణ సమయంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో పాటు వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తారు. ఎన్‌సీఏ సిబ్బందితో పాటు, భారత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఆనంద్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తారు. ఈ శిక్షణా కాలంలో ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలకు, జట్లకు దూరంగా ఉంటారు. జాతీయ అకాడమీలో యువ ఆటగాళ్లకిచ్చే శిక్షణ వారి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని ఎన్‌సీఏ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ నరేంద్ర హీర్వాణి అన్నారు. మరోవైపు ఎన్‌సీఏలో శిక్షణ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు సిద్ధార్థ్‌ కౌల్, అనికేత్‌ చౌదరీ చెప్పారు.